
ముత్యపు పందిరిపై నారాపుర స్వామి
జమ్మలమడుగు : ముత్యపు పందిరి వాహనంపై నారాపుర వెంకటేశ్వరస్వామి దర్శనం ఇచ్చారు. మంగళవారం ఉదయం భూదేవి, శ్రీదేవి సమేతంగా ముత్యపు పందిరిపై స్వామి వారిని పల్లకిలో ఊరేగించారు. భక్తుల కోలాటం, గోవింద నామ స్మరణ, అన్నమాచార్యకీర్తల మధ్య ఊరేగింపు కోలాహలంగా సాగింది. సాయంత్రం సింహ వాహనంపై స్వామి వారు పట్టణంలో ఊరేగి తిరిగి నారాపుర స్వామి ఆలయానికి చేరుకున్నారు. దేవదేవుడు సతీసమేతంగా పురవీధుల గుండా పల్లకిలో వెళుతుండగా భక్తులు హారతులు ఇవ్వడంతో పాటు పూజలు నిర్వహించారు.
తూకాల్లో మోసాలకు పాల్పడవద్దు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : వ్యాపారులు తూకాల్లో మోసాలకు పాల్పడ్డ వద్దని జిల్లా లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ మెట్రాలజీ డే సందర్భంగా మంగళవారం నగరంలోని తూనికలు, కొలతల శాఖ కార్యాలయంలో రైస్, ఆయిల్ మిల్లర్స్, మండీ మర్చంట్ అసోసియేషన్ వారికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోదారులే వ్యాపారానికి శ్రీరామ రక్ష అన్నారు. అందువల్ల తూకాల్లో నాణ్యత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ రమేష్ కుమార్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
బాలిక ఆత్మహత్య
కడప అర్బన్ : కడప నగరంలోని చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వైఎస్‌ఆర్ కాలనీలో బాలిక సోమవారం రాత్రి ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు చిన్న చౌక్ ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు. వైఎస్‌ఆర్ కాలనీకి చెందిన షేక్ సల్మా (14) తండ్రి గత ఏడాది చనిపోవడంతో బాలిక ఇంటి వద్దనే ఉంటోంది. సెల్ ఫోన్‌లో ఇన్‌స్ట్రాగామ్ ఎక్కువ చూస్తుండడంతో బాలిక తల్లి మందలించినట్లు తెలిపారు. దీంతో బాలిక తీవ్ర మనస్తాపం చెంది ఎవరూ లేనప్పుడు ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
వరదాయపల్లెలో చోరీ
మైదుకూరు : మైదుకూరు మండలం వరదాయపల్లెలో ఓ ఇంటిలో చోరీ జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం మధ్యాహ్నం గ్రామానికి చెందిన చిన్రెడ్డి ఆదినారాయణరెడ్డి అనే వ్యక్తి ఇంటిలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆదినారాయణ రెడ్డి భార్య లక్ష్మీదేవి బంధువుల ఇంటికి ఖాజీపేటకు వెళ్లారు. బీరువాలో ఉంచిన సుమారు ఆరు తులాల బంగారు వస్తువులను చోరీ చేసినట్టు తెలుస్తోంది. మైదుకూరు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం సభ్యులు కూడా చోరీ జరిగిన ఇంటిని పరిశీలించి వేలి ముద్రలను సేకరించారు.