
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు సత్వర చర్యలు చేపట్టాలని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేవీ శివారెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ కడప డిపో కార్యదర్శి సగినాల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఉద్యోగులు ఛలో డీపీటీఓ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆర్‌ఎం కార్యాలయం ఎదుట ఉద్యోగులు, కార్మికులు బైఠాయించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నినదించారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ వైద్య సేవలకు సంబంధించి ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కొత్త బస్సులు కొనుగోలు, సిబ్బంది నియామకం, ఎలక్ట్రికల్ బస్సులు ఏపీఎస్ ఆర్టీసీ స్వయంగా కొనుగోలు చేయాలని కోరుతున్నా పట్టించుకునే నాథుడే లేడన్నారు. ఇప్పటికై నా యాజమాన్యం తమ సమస్యలను పరిష్కరించేలా సత్వర చర్యలు చేపట్టాలని, అవసరమైతే సమ్మెలోకి వెళ్లేందుకై నా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి భద్రావతమ్మ, కడప రీజినల్ కార్యదర్శి సుధాకర్, రీజినల్ ప్రెసిడెంట్ నాగముని, అసిస్టెంట్ సెక్రటరీలు సుబ్బారావు, నాగరాజుతోపాటు అన్ని డిపోల అధ్యక్ష కార్యదర్శులు, గ్యారేజ్ అధ్యక్ష కార్యదర్శులు, సీసీఎస్ డెలిగేట్లు, భారీ సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.