
కాంట్రాక్టు గెస్ట్ ఫ్యాకల్టీకి 110 జీఓ అమలు చేయాలి
వేంపల్లె : ఆర్జీయూకేటీ పరిధిలోని అన్ని ట్రిపుల్ ఐటీల్లో కాంట్రాక్టు గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న ఉద్యోగులకు 110 జీఓను అమలు చేయాలని కాంట్రాక్టు గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ అధ్యక్షుడు నజీర్‌హుసేన్ కోరారు. మంగళవారం ఆర్జీయూకేటీ పరిధిలోని ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తాను కాంట్రాక్టు గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగులు కలిసి 110 జీఓను అమలు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో 2018 నుంచి పనిచేస్తున్న కాంట్రాక్టు గెస్ట్ ఫ్యాకల్టీకి జీఓ 110 అమలు చేయకపోవడం వలన జీతాలు తక్కువగా వస్తున్నాయన్నారు. 110 జీఓను అమలు చేసి 2018 నుంచి ఇప్పటి వరకు కాంట్రాక్టు గెస్ట్ ఫ్యాకల్టీలకు సర్వీసు కలపాలన్నారు. అలాగే సర్వీసు ఆధారంగా రావాల్సిన రూ.40వేలు జీతాలను ఇవ్వాలని కోరారు. తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు జూన్ 11, 12, 13 తేదీల్లో ఆయా ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంట్రాక్టు గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.