
తడబడితే తప్పదు మూల్యం
కడప ఎడ్యుకేషన్ : విద్యా సంవత్సరం మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. జిల్లాలో పుట్టగొడుగుల్లా ప్రైవేటు విద్యా సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల తోక పేర్లతో నూతన బ్రాంచిల పేరిట ఆయా ప్రాంతాల్లో ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు హంగులూ, ఆర్భాటాలతో తల్లిదండ్రులను ఆకర్షించేందుకు ప్రచారాలు చేస్తూ ప్రవేశాల ప్రక్రియను చేపడుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే విద్యార్థుల చేరికలో ఆయా పాఠశాలలకు అనుమతి ఉన్నదేదో లేనిదేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో తల్లిదండ్రులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. విద్యాశాఖ నియంత్రణ కొరవడంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే కొన్ని విద్యా సంస్థలు సీబీఎస్‌ఈ అనుమతులు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్త ప్రైవేటు పాఠశాల ప్రారంభించాలంటే విద్యాశాఖ అనుమతి తీసుకోవాలి. మొదట ఓపెనింగ్ అనుమతి తీసుకున్న తర్వాతే విద్యా సంస్థలను తెరచి విద్యార్థులను చేర్చుకోవాలి. తర్వాత పూర్తి స్థాయి అనుమతి పొందాలి. ప్రాథమిక స్థాయికి జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి, ఉన్నత తరగతులు ప్రారంభించాలంటే విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ (ఆర్జేడీ) ద్వారా పాఠశాల విద్యా కమిషనర్ అనుమతి తీసుకోవాలి. సీబీఎస్‌ఈ సిలబస్ బోధించేందుకు కేంద్ర విద్యామండలి సమ్మతించాలి. ఇలా అన్ని అనుమతులుంటేనే పాఠశాలలను నిర్వహించాలి.
వీటిపై ఆరా తీయండి..
ప్రతి విద్యా సంస్థ ప్రభుత్వం నుంచి కచ్చితంగా గుర్తింపు పొంది ఉండాలి. ఇది నిబంధన. అయితే చాలా విద్యాసంస్థల బోర్డులు, ప్రకటనలు నిశితంగా పరిశీలిస్తే రిజిస్టర్ అని ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకోవచ్చు. కానీ విద్యాశాఖ నుంచి గుర్తింపు తీసుకోవడం తప్పనిసరి. గుర్తింపు పొందిన విద్యా సంస్థలలోనే తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలి. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొన్ని పాఠశాలలు ఇతర విద్యా సంస్థల తరపున పరీక్షలు రాయిస్తుంటారు. అలా పరీక్ష రాసిన విద్యార్థుఽలను ప్రభుత్వం ప్రైవేటు విద్యార్థిగానే పరిగణిస్తుంది. మరికొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు బ్రాంచీల పేరుతో పాఠశాలలను, కళాశాలలను నడుపుతూ ఎక్కడో ఉన్న మెయిన్ బ్రాంచి ద్వారా పరీక్షలు రాయిస్తుంటారు. ఇలాంటి విషయాలలో తల్లిదండ్రులు కచ్చితంగా విచారించి విద్యా సంస్థ అనుమతి పత్రాలను అడిగి తెలుసుకున్న తరువాతే పిల్లలను చేర్పించాలి.
ముందస్తు అడ్మిషన్లతో తస్మాత్ జాగ్రత్త
ఆకట్టుకునే ప్రచారాలు నమ్మి మోసపోకండి
పాఠశాలల గురించి తెలుసుకున్నాకే పిల్లలను చేర్పించాలి
రిజిస్ట్రేషన్, గుర్తింపుపై ఆరా తీయండి
క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారని
పరిశీలించాకే అడ్మిషన్ తీసుకోవాలి