
లాహిరి..లాహిరి..లాహిరిలో..
పగలంతా భక్తుల మొరలు విని వారి సమస్యలను తీర్చి శ్రమించిన శ్రీ లక్ష్మి వెంకటేశ్వరుడు సాయంత్రం వాతావరణం చల్లబడ్డాక అలా అలా తెప్పపై జలవిహారం చేస్తూ సేద తీరాడు. దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక తెప్పోత్సవాలో భాగంగా రెండవరోజు ఆదివారం పుష్కరిణిలో తెప్పపై స్వామి, అమ్మవార్లు ఐదుమార్లు విహరించారు. తొలుత ఆలయంలో స్వామి, అమ్మవార్ల మూలమూర్తులను పల్లకీపై కొలువుదీర్చి ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు చేర్చారు. అక్కడి అలంకార మండపంలో విశేష అభిషేకాలు, అలంకారం చేసి, మంగళ హారతులు ఇచ్చి పుష్కరిణిలో సిద్ధంగా ఉంచిన తెప్పపై కొలువుదీర్చారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు త్రివిక్రమ్, కృష్ణమోహన్ బృందం, ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్‌రెడ్డి పర్యవేక్షణలో మంగళ హారతులు ఇచ్చి తెప్పను జల విహారం చేయించారు. భక్తులు ఒళ్లంతా కళ్లు చేసుకుని ఈ మనోహరమైన దృశ్యాన్ని తిలకించి పులకించిపోయారు. భక్తుల గోవిందనామ స్మరణలతో పుష్కరిణి పరిసరాలు మార్మోగాయి. ఈ ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి. –కడప కల్చరల్

లాహిరి..లాహిరి..లాహిరిలో..