
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు సిద్దం చేశారు. ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లావ్యాప్తంగా ప్రథమ సంవత్సర విద్యార్థులకు 48 పరీక్షా కేంద్రాల్లో, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు 26 పరీక్షా కేంద్రాలలో నిర్వహించనున్నారు.
17,408 మంది విద్యార్థులు...
జిల్లావ్యాప్తంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 17,408 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరానికి సంబంధించి 12,378 మంది జనరల్, 692 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు. ఇక సెకండియర్ సంబంధించి 3899 మంది జనరల్, 439 మంది ఒకేషనల్ పరీక్షలను రాయనున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరానికి సంబంధించి ఇంప్రూవ్‌మెంట్ రాసే వారి సంఖ్య అధికంగా ఉండటంతో జనరల్ 12,378 మంది విద్యార్థులు ఉన్నారు. కాగా ప్రథమ సంవత్సర పరీక్షల నిర్వహణ కోసం 48 మంది డిపార్టుమెంట్, 48 మంది చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. అలాగే ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 26 మంది డిపార్టుమెంట్ అధికారులు, 26 మంది చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. వీరితోపాటు ప్లయింగ్, సిట్టింగ్ స్వ్కాడ్‌లను కూడా ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రాలు ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరుకోగా వాటిని ఆయా పోలీసు స్టేషన్లలో భద్రపరిచారు. పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పరీక్షలను పర్యవేక్షించనున్నారు.
రెండు సెషన్లలో...
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలలను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ప్రథమ సంవత్సర పరీక్షలు ఉద యం 9 గంటల నుంచి 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు జరగనున్నాయి.
ఏర్పాట్లను సిద్ధం చేసిన ఇంటర్ విద్యాశాఖ అధికారులు
జిల్లావ్యాప్తంగా పరీక్షలు రాయనున్న 17408 మంది విద్యార్థులు
అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశాం
నేటి నుంచి ప్రారంభం కానున్న సప్లిమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధం చేశాం. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించాం. విద్యార్థులంతా నిర్ణీత సమయానికంటే ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. – బండి వెంకటసుబ్బయ్య,
ఆర్‌ఐవో,ఇంటర్ విద్య

నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు