ప్రొద్దుటూరు రూరల్ : మండలంలోని కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఆవరణలో ఉన్న గ్రామ పంచాయతీకి చెందిన ఒక ట్రాక్టర్, రెండు చెత్త సేకరణ ట్రై సైకిళ్లు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని ఆదివారం మధ్యాహ్నం దగ్ధమయ్యా యి. చెత్త సేకరణకు వినియోగిస్తున్న ట్రాక్టర్ ఇటీవల మరమ్మతులకు గురికావడంతో పక్కన పెట్టామని, అందులోని డీజిల్ ఎండ వేడిమికి మంటలు చెలరేగాయని గ్రామ పంచాయతీ కార్యదర్శి రామమోహన్‌రెడ్డి తెలిపారు. ట్రాక్టర్ టైర్లు, టాప్‌తోపాటు రెండు ట్రై సైకిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయని చెప్పారు. రూ.1.80లక్షలు ఆస్తి నష్టం కలిగినట్లు పేర్కొన్నారు.
ఘర్షణలో గాయపడిన వ్యక్తి మృతి
జమ్మలమడుగు రూరల్ : మండల పరిధిలోని పి. బొమ్మేపల్లి గ్రామంలో ఇంటి ముందు పేడ నీళ్లు చల్లే విషయంలో శనివారం జరిగిన చిన్నపాటి గొడవలో గాయపడిన రామ చౌడప్ప (35) ఆదివారం మృతి చెందాడు. తలకు బలమైన గాయం కావడంతో బంధువులు ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడముతో కర్నూలుకు తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి హైదరాబాదుకు తీసుకెళ్లాలని సూచించారు. ఆదివారం కర్నూలు నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో రామ చౌడప్ప మృతి చెందినట్లు సీఐ ఎస్. లింగప్ప తెలిపారు. మృతుడు బేల్దార్ పనులు చేసుకొని జీవించేవాడు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు.
వ్యక్తి అదృశ్యం
కలసపాడు : మండలంలోని మామిళ్లపల్లె గ్రామానికి చెందిన సూర్యనారాయణరెడ్డి గత నెల 25వ తేదీ నుంచి కనిపించడం లేదని ఎస్‌ఐ తిమోతి తెలిపారు. 25వ తేదీ తన ఇంటి నుంచి వెళ్లిపోయాడని, ఇప్పటి వరకు తిరిగి రాలేదన్నారు. సదరు వ్యక్తి ఆచూకీ ఎవరికై నా తెలిసిన వెంటనే 9121100632 నంబరుకు సమాచారం అందించాలన్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
కడప అర్బన్ : కడప నగరంలోని ఒన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గుర్రాలగడ్డ ప్రాంతంలో ఆదివారం ప్రజల నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేస్తున్న మోచంపేటకు చెందిన సాదిక్‌వలీని ఎస్‌ఐ అమర్‌నాథ్‌రెడ్డి తమ సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 880 కిలోల రేషన్‌బియ్యం స్వాధీనం చేసుకున్నారు.

గ్రామ పంచాయతీ ట్రాక్టర్ దగ్ధం