
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలో ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పక్కాగా చేపట్టామని, కౌంటింగ్ కోసం అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు పేర్కొన్నారు. బుధవారం న్యూఢిల్లీలోని నిర్వచన్ సదన్ నుంచి సార్వత్రిక ఎన్నికలు – 2024 కౌంటింగ్ సన్నద్ధతపై అన్ని నియోజకవర్గాల ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీష్ వ్యాస్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి, త్వరితగతిన కచ్చితమైన ఫలితాల ప్రకటనకు, శాంతి భద్రతల పరిరక్షణకు నియోజకవర్గాల వారీగా ఇప్పటివరకు చేసిన ఏర్పాట్లను, తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ హాల్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు, జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, జేసీ గణేష్ కుమార్, కడప నగర పాలక సంస్థ కమిషనర్ ప్రవీణ్ చంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ వచ్చే నెల 4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేపట్టామని పేర్కొన్నారు. కడప నగర పరిధిలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ ఏర్పాట్లపై అభ్యర్థులు, ఎలక్షన్ ఏజెంట్లతో సమావేశాలు నిర్వహించి పూర్తిగా తెలియజేశామన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో అన్నిరకాల భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. కౌంటింగ్ పూర్తయ్యాక ఈవీఎంల సీలింగ్ కోసం ఏర్పాట్లు చేపట్టామన్నారు. పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియను 4 గంటలలోపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కూడా రెండు విడతలుగా ఇస్తున్నామన్నారు. ఓట్ల లెక్కింపు విజయవంతంగా నిర్వహించేందుకోసం సెక్టోరియల్ అధికారుల నియామకం, సీసీటీవీల ఏర్పాటు, 133, 144 సెక్ఫన్‌లను అమలు చేస్తున్నామన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి హింస జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మొబైల్ పికెట్స్, మొబైల్ పార్టీలను, నైట్ పెట్రోలింగ్ ఏర్పాటు చేశామని, గొడవలు చేసేవారిని, రౌడీషీటర్లను గుర్తించి బైండోవర్ చేశామన్నారు. జిల్లా అంతటా 144 సెక్షన్ అమలు చేస్తున్నామన్నారు. అనంతరం నియోజకవర్గాల వారీగా డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సంబంధిత ఆర్‌ఓలతో కౌంటింగ్ సన్నద్ధతపై సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్వో గంగాధర్ గౌడ్, అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు మధుసూదన్, వెంకటరమణ, కౌసర్ బాను, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, చంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఎన్నికల అధికారి విజయరామరాజు