
ఒంటిమిట్ట రామాలయం (ఇన్‌సెట్) ఏకశిలపై సీతారామలక్ష్మణ మూర్తులు
రాజంపేట: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న రాజంపేట నియోజకవర్గంలోని ఒంటిమిట్ట రామాలయం టీటీడీలో విలీనమైన తర్వాత రాములోరి బ్రహ్మోత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. తెలంగాణలోని భద్రాచలానికి దీటుగా ఒంటిమిట్ట రామాలయాన్ని తీర్చిదిద్దారు. ఈనెల 30 నుంచి ఏప్రిల్ 9 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఏప్రిల్ 5న రాములోరి కల్యాణం కనుల పండువగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఒంటిమిట్ట కోదండరామాలయంపై ప్రత్యేక కథనం.
త్రేతాయుగంలో సీతారామలక్ష్మణ నివాసం..
త్రేతాయుగంలో సీతారామలక్ష్మణులు ఈ ప్రాంతంలో కొంతకాలం నివసించారు. అప్పుడు సీతమ్మకు దాహం వేసింది. రాముడు బాణం సంధించి భూమి లోకి వదిలాడు. నీరు పైకి ఎగజిమ్మింది. సీతమ్మ దప్పిక తీరింది. లక్ష్మణుడు అన్న అనుజ్ఞతో తానూ ఒక బాణం వదిలాడు. నీరుపైకి వచ్చింది. ఆ నీటిబుగ్గలను నేడు రామతీర్థం..లక్ష్మణతీర్థం అని పిలుస్తున్నారు.
ధర్మసంస్థాపన కోసం ఒంటిమిట్ట గుడి..
బుక్కరాయలు కోదండరామాలయం నిర్మించాడు. రాముడిక్కడ కోదండం ధరించి ఉన్నాడు. కోదండం ధర్మరక్షణకు ప్రతీక. అలనాడు శ్రీరామచంద్రుడు అడవుల్లో తిరుగుతూ నార చీరలు ధరించినా కోదండాన్ని విడువలేదు. అది ధర్మరక్షణ కోసమే. బుక్కరాయల తర్వాత సిద్దవటం మట్లిరాజులు ఆలయాన్ని అత్యంత వైభవోపేతంగా తీర్చిదిద్దారు. అనంతరాజు, తిరుమలరాయలు, తిరువెంగళనాథరాజు, కుమార అనంతరాజులు ఒంటిమిట్ట కోవెల్ని తీర్చిదిద్దారు. ఉన్నతమైన ప్రాకార కుడ్యాలు సమున్నతమైన గోపుర శిఖరాలు రంగమంటపాల్లో అద్భుత శిల్ప విన్యాసాలు కనిపిస్తాయి.
ఏకశిలానగరంగా..
ఒంటిమెట్ట మీద నిర్మించిన ఆలయం ఉన్న ప్రదేశం ఒంటిమిట్ట అయింది. ఒంటిమిట్ట గుడికి అనురూపంగానే ఏర్పడిన మరోపేరు ఏకశిల. ఒకేశిలలో సీతారామలక్ష్మణ విగ్రహాలు నిర్మించారు. జాంబవంతుడు ముగ్గురిని ఒకే శిలలో భావించుకున్నాడు. ఆ తర్వాత కాలంలో కంపరాయలు, బుక్కరాయలు అదే సంప్రదాయంతో ఏకశిలలో ముగ్గురు మూర్తులు ఉండేలా నిర్మాణం చేయించారు. బహుశా ఒకే శిలలో ముమ్మూర్తులను నిలిపిన సంఘటన ఒంటిమిట్టలో మొదటిగా ఆవిష్కృతమైంది. అరుదుగా కొలువైన ఏకశిలా విగ్రహ ప్రాంతాన్ని ఏకశిల అని భక్తితో అన్నాడు పోతన.
ఒంటిమిట్ట కవులు..అపరభక్తులు..
ఒంటిమిట్ట కోదండరాముని సేవిస్తూ కవులెందరో తరించారు. వారిలో అయ్యలరాజు తిప్పయ్య, బమ్మెర పోతన, అయ్యలరాజు రామభద్రుడు, ఉప్పుగొండూరు వెంకటకవి, వరకవి నల్లకాల్వ అయ్యప్ప, వాసుదాసు వావిలికొలను సుబ్బారావులు కోదండరామునిపై సాహిత్యం, కీర్తనలు, రచనలతోపాటు ఆలయ అభివృద్ధికి తోడ్పడ్డారు.. మాలఓబన్న, ఇమామ్‌బేగ్ లాంటి ఎందరో అపర భక్తరామదాసులు స్వామివారిని సేవించి తరించిపోయారు.
బ్రహ్మోత్సవ వివరాలు
మార్చి 30 న వ్యాసాభిషేకం, సాయంత్రం అంకురార్పణ
31న ధ్వజారోహణం, సాయంత్రం పోతన జయంతి, రాత్రికి శేషవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం
ఏప్రిల్ 01న వేణుగానాలంకారం, రాత్రికి హంసవాహనంపై ఊరేగింపు
02న వటపత్రసాయి అలంకారం, రాత్రికి సింహవాహనంపై భక్తులకు దర్శనం
03న నవనీత కృష్ణాలంకారం, రాత్రికి హనుమంతసేవ
04న మోహినీ అలంకారం, రాత్రి గరుడ సేవలో కోదండరాముడు
05న శివధనురాణాలంకారం, రాత్రికి ఎదుర్కోలు ఉత్సవం, అనంతరం పండువెన్నెలలో 8గంటల నుంచి 10గంటలలోపు సీతారాముల కల్యాణం
06న రథోత్సవం
07న కాళీయమర్ధనాలంకారం, రాత్రికి అశ్వవాహనం
08న చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం
09న రాత్రి పుష్పయాగం, ఏకాంతసేవలో కోదండరాముడు
జాంబవంతుడు ప్రతిష్టించిన రామక్షేత్రం ఒంటిమిట్ట కోదండరామాలయం
త్రేతాయుగంలో సీతారామలక్ష్మణ నివాసమే ఏకశిలానగరం
ఆంజనేయడు లేకపోవడమే ఆలయ ముఖ్య విశేషం
వంటడు..మిట్టడుతో ఆలయ నిర్మాణానికి అంకురార్పణ
నేటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
