మర్రిపాడు : నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని సింగనపల్లి అటవీ సమీపంలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతదేహాన్ని బుధవారం గుర్తించారు. పోలీసుల కథనం మేరకు.. స్థానికుల సమాచారంతో తొలుత అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై విశ్వనాథరెడ్డి మృతదేహం ఫొటోలను వైఎస్సార్, నెల్లూరు జిల్లాలోని పోలీస్‌స్టేషన్లకు సమాచారం అందించారు. కాగా బద్వేల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి అదృశ్యంపై ఫిర్యాదు నమోదైనట్లు గుర్తించారు. సదరు కుటుంబీకులకు తెలియజేయడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం తమ వారిదేనని నిర్ధారించారు. దీంతో మృతుడు వైఎస్సార్ జిల్లా బద్వేల్ మండలం నందిపల్లి గ్రామానికి చెందిన మన్నెం బలరామిరెడ్డి (73)గా గుర్తించారు. ఇటీవల ఆయనకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఇక్కడకు వచ్చి ఆత్మహత్యకు పాల్పడి ఉంచొచ్చని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు ఘటన స్థలంలో విషపు గూళికులు కూడా ఉండడంతో వాటిని తిని మృతిచెంది ఉండొచ్చని పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మర్రిపాడు పోలీసులు తెలిపారు.