
స్వాధీనం చేసుకున్న నగదు
రైల్వేకోడూరు : అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలంలో ఆయకట్టుదారులకు సంబంధించి జన్యూన్‌నెస్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు కాంట్రాక్టర్ నుంచి 20వేలు లంచం తీసుకుంటున్న వీఆర్వో ఏసుదాసును బుధవారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పట్టణంలోని స్థానిక తహసీల్దారు కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ కంజాక్షన్ తెలిపిన వివరాలమేరకు రైల్వేకోడూరు మండలం ఓబనపల్లె పంచాయతీలోని పిచ్చయ్యకుంట, పెద్దకుంట, మర్రిమానుకుంట చెరువులకు సంబంధించి 17–01–2022, 05–01–2023 సంవత్సరానికి గాను ఆయకట్టు పనులు జరిగాయో.. అందుకు రైతుకు ఆ సామాజిక వర్గానికి చెందిన జన్యూన్‌నెస్ సర్టిఫికెట్ ఇవ్వమని చెబుతూ కాంట్రాక్టర్ ఓబయ్యనాయుడు స్థానిక తహసీల్దారుకు విన్నవించారు.
ఇందులో భాగంగా కాంట్రాక్టర్ వీఆర్వో ఏసుదాసును సంప్రదించినట్లు తెలిపారు. అయితే జన్యూన్‌నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే 50 వేల రుపాయలు ఇవ్వాలని వీఆర్వో ఏసుదాసు డిమాండ్ చేసినట్లు తెలియజేశారు. బుధవారం కోడూరు రైల్వేస్టేషన్‌రోడ్డులోని ఎల్‌ఐసి కార్యాలయం సమీపంలో ఓబయ్యనాయుడు వద్ద నుంచి వీఆర్వో ఏసుదాసు 20వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని, అనంతరం కోర్టుకు సమగ్ర నివేదిక అందించనున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ సీఐలు ఎల్లమరాజు, కృష్ణమోహన్, మహమ్మద్ అలీ పాల్గొన్నారు.