మదనపల్లె(అన్నమయ్య జిల్లా) : మండలంలోని సీటీఎం శ్రీనలవీర గంగాభవాని అమ్మవారి ఆలయంలో బుధవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు హుండీ ధ్వంసం చేసి, అందులో ఉన్న నగదు అపహరించారు. సుమారు రూ.70వేల నగదు, భక్తులు అమ్మవారికి ముడుపుల రూపంలో సమర్పించే వెండి కళ్లు కోరలు చోరీకి గురయ్యారని స్థానికులు, ఆలయకమిటీ సభ్యులు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ముసుగులు ధరించి ఆలయంలోకి ప్రవేశించినప్పుడు ఆలయంలో పడుకున్న గౌరమ్మ గమనించిందన్నారు. చప్పుడు చేస్తే వారు తనను చంపేస్తారేమోనన్న భయంతో మౌనంగా ఉండిపోయిందన్నారు. బుధవారం ఉదయం ఆలయం తలుపులు తెరవగానే హుండీ ధ్వంసం చేసి ఉండటాన్ని స్థానికులు గమనించి ఆలయకమిటీ సభ్యులకు సమాచారం అందించారు. వారు గౌరమ్మను విచారించగా చోరీ జరిగిన విషయం చెప్పింది. ఈక్రమంలో సభ్యులు వెంటనే తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. సీఐ సత్యనారాయణ సిబ్బందితో కలిసి ఆలయానికి చేరుకుని హుండీని పరిశీలించారు. ఘటనపై ఆరా తీశారు. క్లూస్‌టీం ఆలయానికి చేరుకుని ఆధారాలను పరిశీలించి తనిఖీ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారని కమిటీ సభ్యులు తెలిపారు. గతనెలలో పగలు తిరుణాల తర్వాత హుండీ లెక్కించలేదని, దాదాపు రెండునెలల పాటు హుండీలో భక్తులు వేసిన నగదు రూ.70వేల వరకు ఉండవచ్చని పోలీసులకు తెలిపారు. చోరీ విషయమై తాలూకా సీఐ సత్యనారాయణనని విచారిస్తే బుధవారం సాయంత్రం వరకు తమకు చోరీ విషయమై ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించడంతో పాటు క్లూస్‌టీంతోనూ తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు.