కడప సిటీ : గ్రామ స్థాయిలో వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ గర్భిణిలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ విజయ రామరాజు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సభాభవన్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు తో కలిసి జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వహించే వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్ష చేశారు. డీసీహెచ్‌ఎస్ డాక్టర్ హిమదేవి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు, పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు పాల్గొన్నారు.
సంపూర్ణ పోషణ అందించాలి
చిన్న పిల్లలకు, గర్భిణిలకు వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ తప్పకుండా పంపిణీ చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను కలెక్టర్ విజయ రామరాజు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాలులో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ పథక అమలుపై ఓఎస్డీ రఘునాథ్, ఐసీడీఎస్ పీడీ ఎంఎన్ రాణి, సూపర్‌వైజర్లతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ప్రాధాన్యతా రంగాలు మరింత పటిష్టం
అన్ని ప్రాధాన్యతా రంగాలను మరింత పటిష్టం చేయాలని కలెక్టర్ విజయ రామరాజు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాలులో కలెక్టర్ అధ్యక్షతన అన్ని రకాల ప్రాధాన్యతా రంగాలకు చెందిన జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వర రావు, ఏపీఎంఐపీ పీడీ రవీంద్రా రెడ్డి, డీసీఓ సుభాషిణి, అధికారులు పాల్గొన్నారు.
కెరీర్ గైడెన్స్ పుస్తకం ఆవిష్కరణ
వివేకానంద ఫౌండేషన్ వ్యవస్థాపకులు పాపిజెన్ని రామకృష్ణారెడ్డి పదవ తరగతి విద్యార్థులకు రూపొందించిన కెరీర్ గైడెన్స్ పుస్తకాన్ని, తమ సంస్థ గౌరవ సలహాదారులు రాజోలి శ్రీధర్ రెడ్డి రూపొందించిన సంస్థ బ్రోచర్ ను కలెక్టర్ విజయరామరాజు తన చాంబర్‌లో ఆవిష్కరించారు.