ఒంటిమిట్ట: ఒంటిమిట్ట మండలంలో గల అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల విజయంతానికి సమష్టిగా కృషి చేయాలని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి ఆదేశించారు. ఎంపీపీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే వేలాది భక్తులకు అత్యవసర చికిత్స అందించేందుకు ఎల్లవేళలా మండల వైద్యాధికారులు అందుబాటులో ఉండాలన్నారు. అలాగే బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు మేడా కన్‌ష్ట్రక్షన్స్ తరపున దాదాపు 80 వేల అన్నప్రసాదం ప్యాకెట్లు పంపిణీ చేయనున్నామని తెలిపారు. ఒంటిమిట్టలో నిత్య కల్యాణం జరుగుతున్న సందర్భంగా కల్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన వేదికపై దాదాపు 3 పెళ్లిళ్లు చేసుకోవచ్చన్నారు. ఇందుకు టీటీడీకి రూ. 10 వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. అలా కాకుండా పెళ్లికి నెల ముందే మేడా కన్‌స్ట్రక్షన్స్ వారితో మాట్లాడి నమోదు చేసుకుంటే టీటీడీకి చెల్లించాల్సిన మొత్తం రూ 10 వేలను తామే చెల్లిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.