
సదస్సులో పాల్గొన్న అధ్యాపకులు, విద్యార్థులు
వైవీయూ : ప్రజాస్వామ్యానికి పునాది ప్రాథమిక హక్కులని, వాటి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని యోగివేమన విశ్వవిద్యాలయం పీజీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె. కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం వైవీయూ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ శాఖ విభాగాధిపతి డాక్టర్ జి.పార్వతి ఆధ్వర్యంలో వైవీయూలో జాతీయ మానవ హక్కుల కమిషన్, న్యూఢిల్లీ సహకారంతో మానవ హక్కులపై ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే మానవహక్కులు ప్రజలందరూ వినియోగించుకునేలా ఉండాలన్నారు. హక్కులతోపాటు బాధ్యతలను కూడా నిర్వర్తించడం ప్రథమ కర్తవ్యం అన్నారు. మానవహక్కుల అమలులో యూఎన్‌ఓ 2030 నాటికి ఏర్పరచుకున్న 17 లక్ష్యాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. హైదరాబాద్ మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రం, సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఎకనామిక్స్ ఆచార్య అమీరుల్లాఖాన్ మాట్లాడుతూ మనదేశంలో 10 కోట్ల మంది ఆకలి ఇబ్బందులతో ఉన్నారన్నారు. రీసోర్స్‌పర్సన్‌గా హాజరైన తిరుపతి ఎస్వీయూ పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆచార్యులు డాక్టర్ బి.వి.మురళీధర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం, మానవహక్కులు అనే అంశంపై చారిత్రక సంఘటనల పట్ల అవగాహన కల్పించారు. సీనియర్ న్యాయవాది ఎం.చంద్రకాంతమ్మ మాట్లాడుతూ రాష్ట్ర, జాతీయ మానవ హక్కుల కమిషన్లు పని చేసే విధానాలు, ప్రజలకు ఎలా ఉపయోగపడతాయో అవగాహన కల్పించారు. మానవ హక్కుల కార్యకర్త పి.వరలక్ష్మి మాట్లాడుతూ అంబేడ్కర్ రాజ్యాంగంలో చేర్చినట్లు స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం ఉంటే అక్కడ మానవహక్కులు అమలవుతున్నట్లని వివరించారు. సదస్సు కన్వీనర్ డాక్టర్ జి.పార్వతి మాట్లాడుతూ శిక్షణలో విలువైన అంశాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ ప్రమీళ మార్గరేట్, డాక్టర్ సతీష్‌బాబు, డాక్టర్ వినయ్‌కుమార్, డాక్టర్ రామయ్య, దామోదర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

జ్యోతి వెలిగిస్తున్న ప్రిన్సిపాల్ కె. కృష్ణారెడ్డి