
ఊటుకూరులోని రవాణా శాఖ కార్యాలయం
పెరుగుతున్న వాహనాలు.. నిర్లక్ష్య చోదకం.. మద్యం తాగి వాహనాలు నడపడం.. తదితర కారణాలతో రోజురోజుకు రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. వీటిని నియంత్రించాలంటే ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలి.. వాహనాల వేగానికి కళ్లెం వేయాలి. నిదానమే నినాదం కావాలి.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : జిల్లాలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. పలు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వాహనాలు నడపడంలో నిర్లక్ష్యం, లైసెన్స్ లేకుండా, రిజిస్ట్రేషన్ చేయించకుండానే తిప్పడం, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, మద్యం సేవించి నడపడమే ఇందుకు ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి. వీటిని అరికట్టేందుకు 34 ఏళ్లుగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏటా వాహనచోదకులకు రహదారుల్లో సురక్షిత డ్రైవింగ్, ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.
50 శాతం మందికే డ్రైవింగ్ లైసెన్స్‌లు
కడప, ప్రొద్దుటూరు, రవాణాశాఖ పరిధిలో అన్ని రకాల వాహనాల సంఖ్య సుమారు 9,97,898 ఉన్నాయి. కానీ డ్రైవింగ్ లైసెన్స్‌లు మాత్రం వాహనాలతో పోల్చి చూస్తే సుమారు 50 శాతం కూడా లేవు. రవాణాశాఖ డ్రైవింగ్ లైసెన్స్ ప్రతి వాహన చోదకుడు కలిగి ఉండాలని ఏటా ఎన్నో అవగాహన కార్యక్రమాలు, ఎల్‌ఎల్‌ఆర్ మేళాలు నిర్వహిస్తున్నా ఫలితం లేకపోతోంది. రవాణా శాఖ డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియను సులభతరం చేయాలని ఎల్‌ఎల్‌ఆర్ పరీక్ష ప్రమాణికంగా ఉన్న కనీస విద్యార్హత కూడా మినహాయింపు చేసింది.
2019 నుంచి..
2019 నుంచి 2023లో ఇప్పటి వరకు 1541 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో 2019లో మొత్తం 1320 ప్రమాదాలు జరగగా 320 మంది మృత్యువాత పడగా 1613 మంది గాయపడ్డారు. 2020లో 762 ప్రమాదాలు జరగగా 266 మంది మృతి చెందగా, 920 మంది గాయాలపాలయ్యారు. 2021లో 801 ప్రమాదాలు జరగగా 317 మంది మృతి చెందగా 913 మంది గాయపడ్డారు. 2022లో 738 ప్రమాదాలు జరగగా 357 మంది మృత్యువాత పడగా 794 మంది గాయాల పాలయ్యారు. 2023లో ఇప్పటి వరకు 94 ప్రమాదాలు జరగగా 61 మంది మృతి చెందగా 111 మంది గాయపడ్డ వారిలో ఉన్నారు.
ఇవి పాటించాలి
● వాహన చోదకులు రహదారుల్లో ఏర్పాటు చేసిన వేగ నియంత్రణ సూచిక బోర్డుల ఆధారంగా వాహనాలను నడపాలి.
● డ్రైవింగ్ లైసెన్స్ ప్రతి వాహన చోదకుడు కలిగి ఉండాలి.
● మైనర్లకు వాహనాలను ఇవ్వకూడదు.
● సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు.
● మద్యం సేవించి వాహనాలు నడుపరాదు.
● ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ విధిగా ధరించాలి
● కార్లు నడిపే చోదకులు సీటు బెల్ట్ పెట్టుకోవాలి
● ద్విచక్ర వాహనాల్లో త్రిబుల్ డ్రైవింగ్ ప్రమాదకరం, నేరం.
● వాహనాలకు, ఆర్సీ, ఎఫ్‌సీ, భీమా, పొల్యూషన్ సర్టిఫికెట్లు ఉండాలి.
● రహదారులపై ద్విచక్ర వాహన చోదకులు రైడింగ్ వంటి ఫీట్లు చేస్తే శిక్షార్హులు.
వైఎస్‌ఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల వివరాలు
సంవత్సరం ప్రమాదాలు మృతులు గాయపడ్డ
వారు
2019 1320 540 1613
2020 762 266 920
2021 801 317 913
2022 738 357 794
2023 94 61 111
ఇప్పటి వరకు
రహదారి భద్రత నియమాలు పాటించని వాహనదారులు
నియంత్రణ కోల్పోయి
నిత్యం ఏదో చోట ప్రమాదాలు
2019 నుంచి ఇప్పటి వరకు
1541 మంది మృత్యువాత
నియమాలు పాటించాలి
ప్రతి వాహనాదారుడు ప్రభుత్వం సూచించిన రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి. ప్రతి వాహనాదారుడు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. వాహనదారులకు రోడ్డు భద్రతా నియామాలపైన అవగాహన లేకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలను నివారించాలంటే రోడ్డు భద్రతా నియామాలను పాటించాలి. – ఇ. మీరాప్రసాద్, డీటీసీ, కడప
