పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం
సాక్షి,యాదాద్రి : జిల్లాలో మూడు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేసిన వివిధ శాఖల అధికారులను కలెక్టర్ అభినందించారు. ఎన్నికల ప్రక్రియకు సహకరించిన ఆయా శాఖల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
అధ్యయనోత్సవాల ప్రచార పోస్టర్లు ఆవిష్కరణ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఈ నెల 30న నిర్వహించే ముక్కోటి ఏకాదశి, అధ్యయనోత్సవాలకు సంబంధించిన ప్రచార పోస్టర్లను ఆలయ ఈఓ వెంకట్రావ్, అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి గురువారం ఆవిష్కరించారు. పోస్టర్లను గర్భాలయంలో, ముఖ మండపంలోని సువర్ణ పుష్పార్చన మూర్తుల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈఓ మాట్లాడుతూ... ముక్కోటి ఏకాదశి వేడుకలకు భక్తులందరిని ఆహ్వానించేందుకు ప్రచార పోస్టర్లను రాష్ట్ర వ్యాప్తంగా పంపిస్తున్నామన్నారు. ధర్మ ప్రచారంలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో నిర్థిష్ట తేదీల్లో శ్రీస్వామి వారి కల్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయాధికారులు రఘు, రాజన్‌బాబు, ఆర్‌ఐ శేషగిరిరావు, ప్రధానార్చకులు–2 సురేంద్రచార్యులు, అర్చకులు లక్ష్మణాచార్యులు తదితరులున్నారు.
రేపు అవగాహన సదస్సు
భువనగిరిటౌన్ : ‘మీ డబ్బు మీ హక్కు’పై శనివారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు లీడ్ బ్యాంకు మేనేజర్ శివరామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజలు తమ గుర్తింపు పత్రాలు, ఖాతా వివరాలతో హాజరు కావాలని కోరారు.
కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వేకు సహకరించాలి
భువనగిరి : కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వేకు సహకరించాలని కుష్ఠు వ్యాధి నిర్మూలన జిల్లా అధికారి డాక్టర్ వంశీకృష్ణ కోరారు. గురువారం భువనగిరి పట్టణంలోని హన్మాన్‌వాడలో నిర్వహించిన సర్వేలో ఆయన మాట్లాడారు. ఈ సర్వే ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. వ్యాధి నిర్ధారణ జరిగిన వారికి ఉచితంగా చికిత్స అందించడంతో పాటు మందులు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ నిరోష, వినిత్‌రెడ్డి, డీపీఎంవోస్ రాములు, మాధవి, అనిత, రమేష్ నాయక్ పాల్గొన్నారు.
21న పురుషుల
జిల్లా కబడ్డీ సెలక్షన్స్
ఆలేరు : ఈ నెల 21న ఆలేరు మైదానంలో పురుషుల 72వ జిల్లా కబడ్డీ సెలక్షన్స్ నిర్వహించనున్నట్టు కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూల నాగయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 85 కిలోల లోపు బరువు ఉన్న క్రీడాకారులు ఆధార్ కార్డుతో ఉదయం 10గంటత లోపు సెలక్షన్స్‌కు హాజరుకావాలని పేర్కొన్నారు. సెలక్షన్స్‌లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు యాదాద్రిభువనగిరి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. ఈనెల 25వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కరీంనగర్ జిల్లాలోని అంబేడ్కర్ స్టేడియంలో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు.
ధ్యానంతో
మానసిక ప్రశాంతత
నల్లగొండ టూటౌన్ : రోజూ ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుందని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఈనెల 21న ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా కన్హా హార్ట్‌ఫుల్ నెస్ సంస్థ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను ఆ సంస్థ ప్రతినిధులతో కలిసి గురువారం యూనివర్సిటీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ రోజూ ధ్యానం చేయడం ద్వారా మానసిక సమతుల్యత వస్తుందని, నిత్య సాధనతో ఉత్సాహంగా పని చేయవచ్చన్నారు. ధ్యాన దినోత్సవం ప్రధాన లక్ష్యం శాంతి కరుణ, ఐక్యత అని పేర్కొన్నారు. ఈనెల 21న ప్రపంచ వ్యాప్తంగా ధ్యాన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో జోగారెడ్డి, వెంకటాచారి పాల్గొన్నారు.


