బీజేపీ అరాచకాలను సహించేది లేదు
భువనగిరిటౌన్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అరాచకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ప్రభుత్వ విప్, డీసీసీ అధ్యక్షుడు, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు గురువారం జిల్లా కేంద్రంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. బీజేపీ చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తూ, పార్లమెంట్ సాక్షిగా ప్రజలకు తెలియజేస్తున్న రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్ధతిలో మోదీ పాలన కొనసాగుతోందని విమర్శించారు. అనంతరం బీజేపీ జిల్లా కార్యాలయం ముట్టడికి బయలుదేరిన బీర్ల ఐలయ్య, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కో ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి, టీపీసీసీ సభ్యుడు తంగళ్లపల్లి రవికుమార్, నాయకులు పాల్గొన్నారు.
దోషులుగా చిత్రీకరించేందుకు అక్రమ కేసులు..
యాదగిరిగుట్ట: గాంధీ కుటుంబాన్ని నేషనల్ హెరాల్డ్ కేసులో దోషులుగా చిత్రీకరించేందుకు ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసును వ్యతిరేకిస్తూ ఏఐసీసీ, టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మోదీ అధికారంలోకి వచ్చాక మతాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. దేశమంతా కాంగ్రెస్ వైపు ఉన్నారని, అక్రమ కేసులతో ఎవరూ భయపడేది లేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, రాష్ట్ర నాయకులు పోత్నక్ ప్రమోద్‌కుమార్, తంగెళ్లపల్లి రవికుమార్, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, మహిళా జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ తదితరులున్నారు.
ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
బీజేపీ అరాచకాలను సహించేది లేదు


