 
															విద్యుదాఘాతంతో అసిస్టెంట్ లైన్‌మెన్ మృతి
మోత్కూరు : వ్యవసాయ బావి వద్ద ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులు చేస్తుండగా అసిస్టెంట్ లైన్‌మెన్ విద్యుత్‌షాక్‌తో మృతిచెందాడు. ఈసంఘటన గురువారం మోత్కూరు మండలం పాలడుగు గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి పాలడుగు గ్రామ శివారులో బొడిగ కిష్టయ్య వ్యవసాయ బావి సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ ప్లింత్‌ప్లాట్ ఫామ్ నుంచి ఒరిగింది. దానిని సరి చేసేందుకు దత్తప్పగూడెం గ్రామానికి చెందిన అసిస్టెంట్ లైన్‌మెన్ ఓర్సు సురేష్ (34), మరొక హెల్పర్‌తో కలిసి అక్కడికి వెళ్లాడు. ట్రాన్స్‌ఫార్మర్‌ను సరి చేసి బిగించే క్రమంలో ఎల్‌టీ వైరు హెచ్‌టీ వైరుకు తాకడంతో సురేష్ విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. చికిత్స నిమిత్తం భువనగిరి ఆస్పత్రికి తరలిస్తుండగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి మృతుడికి భార్య, పదేళ్ల లోపు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
పది రోజుల్లోపే విద్యుత్
శాఖకు చెందిన ఇద్దరు మృతి
పది రోజుల లోపే విద్యుత్ శాఖకు చెందిన ఇద్దరు సిబ్బంది విద్యుదాఘాతంతో మృతి చెందారు. ఈ నెల 25న మోత్కూరులోని ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుల కేంద్రంలో రోజువారీ వర్కర్‌గా పనిచేస్తున్న బద్దిపడగ భాస్కర్‌రెడ్డి (23) వైండింగ్ చేసిన ట్రాన్స్‌ఫార్మర్ టెస్టింగ్ చేస్తున్న క్రమంలో మెయిన్ హ్యాండిల్ ఆన్ చేయగా విద్యుత్‌షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన మరువక ముందే దత్తప్పగూడేనికి చెందిన అసిస్టెంట్ లైన్‌మెన్ సురేష్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద రిపేరు చేస్తుండగా మృతి చెందాడు. ఇద్దరూ విద్యుత్ శాఖకు చెందిన సిబ్బంది కావడంతో ఆ శాఖ ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని బాధితుల కుటుంబాలు కోరుతున్నాయి.
ఫ ట్రాన్స్‌ఫార్మర్ రిపేర్ చేస్తుండగా ఘటన

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
