 
															యాదగిరిగుట్ట ఆలయ ఎలక్ట్రికల్ ఈఈ రిమాండ్
యాదగిరిగుట్ట: రూ.1.90లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ ఎలక్ట్రికల్ ఈఈ ఊడేపు వెంకట రామారావును ఏసీబీ అధికారులు గురువారం రిమాండ్‌కు తరలించారు. బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం వరకు యాదగిరి కొండపైన గల ఆయన కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చందర్ ఆధ్వర్యంలో విచారణ చేశారు. అనంతరం నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించినట్లు నల్లగొండ రేంజ్ ఏసీబీ డీఎస్పీ జగదీశ్ చందర్ తెలిపారు. గురువారం ఆయన యాదగిరి కొండపైన విలేకరులతో మాట్లాడారు. కాంట్రాక్టర్లు ప్రసాదం మిషనరీ రిప్లేస్‌మెంట్, రిపేర్ల బిజినెస్‌లో భాగంగా బిల్లు మంజూరు చేసేందుకు వెంకటరామారావు రూ.2లక్షలకు పైగా డబ్బులు డిమాండ్ చేశాడని, ఒప్పందం ప్రకారం.. రూ.1.90లక్షలు ఇస్తానని కాంట్రాక్టర్లు ఒప్పుకున్నారని తెలిపారు. ఈ విషయంపై కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేయడంతో రామారావు వ్యవహారంపై నిఘా పెట్టి, గతంలో ఉన్న ఆరోపణలు, వీడియో, ఆడియో ఎవిడెన్స్ కలెక్ట్ చేశామని ఏసీబీ డీఎస్పీ చెప్పారు. దేవాదాయశాఖ ఇన్‌చార్జ్ ఎస్‌ఈగా ఉన్న రామారావు మేడారం ఆలయ పరిశీలనకు వెళ్లి, హైదరాబాద్‌కు తిరిగి వచ్చే క్రమంలో కాంట్రాక్టర్ల నుంచి లంచం డబ్బులు తీసుకుంటున్న క్రమంలో మేడిపల్లిలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆయనను కస్టడీలోకి తీసుకొని యాదగిరిగుట్ట ఆలయంలోని కార్యాలయంలో రికార్డులు పరిశీలించినట్లు చెప్పారు.
ఆయనొక్కడే డీలింగ్
ఈఈ రామారావు అక్రమంగా సంపాదించే విషయంలో అంతా ఆయన ఒక్కడే డీలింగ్ చేస్తాడని తేలింది. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ రూపంలో వచ్చే డబ్బుల విషయంలో అతనొక్కడే తీసుకుంటాడని తెలిసింది. విచారణలో ఉన్నతాధికారుల ప్రమేయం లేదని రామారావు ఏసీబీ అధికారుల ముందు ఒప్పుకున్నట్లు సమాచారం. కొండపైన తనకు సంబంధించిన శాఖలో ఎవరైనా కాంట్రాక్టర్లు పనులు చేయాలంటే కమిషన్ పర్సంటేజ్ మాట్లాడిన తరువాతే బిల్లులు మంజూరు చేశాడని పలువురు కాంట్రాక్టర్లు చెబుతున్నారు.
విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో ఈఈ రామారావు నివాసం ఉంటున్న ఇంటిలో ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో విలువైన భూమి పత్రాలు, డాక్యుమెంట్లు, నగదు దొరికినట్లు తెలుస్తోంది. రామారావు అక్రమంగా సంపాదించిన నగదు, భూముల పత్రాలను, ఆయన ఎవరి పేరున భూములు రిజిస్ట్రేషన్ చేశాడు, ఆయనకు వచ్చే జీతం ఎంత, అక్రమంగా సంపాదించిన నగదు అంశాలపై ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు తెలిసింది. ఎల్బీనగర్‌లోని రామారావు ఇంట్లో హైదరాబాద్ రేంజ్ ఏసీబీ అధికారులు 8 మంది సోదాలు చేశారు. అదేవిధంగా యాదగిరిగుట్ట దేవాలయంలోని ఈఈ కార్యాలయంలో 15మంది ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
