 
															స్వర్ణగిరిలో గిరి ప్రదక్షిణ
భువనగిరి: పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో గల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారం శ్రావణ నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, నిత్య కళ్యాణమహోత్సవం, తిరుప్పావడ సేవ జరిపించారు. సాయంత్రం స్వామి వారికి రథోత్సవ సేవ నిర్వహించారు.
వరుసగా వాహనాలు ఢీ
నార్కట్‌పల్లి: నార్కట్‌పల్లి సమీపంలోని హైదరాబాద్ – విజయవాడ రహదారిలో గురువారం వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. నార్కట్‌పల్లి శివారులో రోడ్డు పక్కన ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీకొంది. అదే రోడ్డుగుండా వస్తున్న హైదరాబాద్ నుంచి ఖమ్మంకు ఖైదీలను తరలిస్తున్న పోలీస్ వాహనం ముందున్న కారును ఢీకొంది. ఈ పోలీస్ వాహనాన్ని మరో కారు వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో వాహనాలు దెబ్బతినగా.. అందులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
ఆయిల్ పరిశ్రమలో తనిఖీలు
చిట్యాల: మండలంలోని వట్టిమర్తి గ్రామ పరిధిలో గల అగ్రో ఆయిల్ పరిశ్రమలో గురువారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. పరిశ్రమలో తయారు చేస్తున్న రిఫైన్డ్ ఆయిల్ ప్యాకింగ్ డబ్బాలపై సరైన వివరాలు లేనట్లు అధికారులు గుర్తించారు. ఈ అంశాలపై రికార్డు చేసిన పత్రాలపై సంబంధిత పరిశ్రమ ఉద్యోగులు సంతకాలు చేయకుండా నిరాకరించడంతోపాటు తనిఖీలు చేయకుండా అధికారులను అడ్డుకున్నారు. ఈ విషయాన్ని ఉమ్మడి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారిణి జ్యోతిర్మయికి తెలపడంతో ఆమె పరిశ్రమ వద్దకు చేరుకుని పరిశీలించారు. సుమారుగా 1600 లీటర్ల ఆయిల్ డబ్బాలతోపాటు, 4800 కేజీ ఆయిల్ ముడి పదార్థాలు గుర్తించారు. ఆయిల్ డబ్బాలు నిబంధనల మేరకు లేనట్లు గుర్తించి వాటిని సీజ్ చేసి పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు తరలించారు.
దాడికి పాల్పడిన వారికి ఆరు నెలల జైలు
తుంగతుర్తి : భూ వివాదం కారణంగా ఓ వ్యక్తిపై కరలత్రో దాడి చేసిన నలుగురికి ఆరు నెలల జైలు, రూ.500 జరిమానా విధిస్తూ తుంగతుర్తి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ఎండీ గౌస్‌పాషా గురువారం తీర్పునిచ్చారు. తిరుమలగిరి మండలంలోని బండ్లపల్లి గ్రామానికి చెందిన రాగుశాల నరసింహ స్వామికి, లింగంపల్లి నరసింహస్వామి మధ్యన భూ వివాదం ఉంది. ఈక్రమంలో 2015లో రాగుశాల నరసింహస్వామిపై లింగంపల్లి నరసింహ, ఆయన భార్య లక్ష్మి, వారి కుమారుడు వెంకటేశ్వర్లు, కోడలు సుజాత కర్రలతో దాడి చేశారు. దీంతో రాగుశాల నరసింహ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అప్పటి ఎస్‌ఐ మహేష్ కేసు నమోదు చేశారు. గురువారం సాక్షులను విచారించిన న్యాయమూర్తి ఎండీ గౌస్ పాషా నిందితులైన లింగంపల్లి నరసింహతో పాటు అతని భార్య లక్ష్మి, వారి కుమారుడు వెంకటేశ్వర్లు, కోడలు సుజాతలకు ఆరు నెలల జైలు, రూ.500 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
