 
															శాలిగౌరారం మార్కెట్ యార్డుకు తాళం
శాలిగౌరారం: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రానికి గురువారం మార్కెట్‌యార్డు ప్రధాన గేట్‌కు మార్కెట్ కార్యదర్శి చీనానాయక్, పీఏసీఎస్ సీఈఓ నిమ్మల ఆంజనేయులు తాళం వేశారు. ధాన్యం రాశులతో వ్యవసాయ మార్కెట్‌యార్డు పూర్తిగా నిండిపోవడంతో స్థలం కొరత ఏర్పడిందని, అందుకే రైతులు ధాన్యం తీసుకురాకుండా మార్కెట్‌యార్డు ప్రధాన గేటుకు తాళం వేసినట్లు వారు తెలిపారు. మార్కెట్‌యార్డులోని ధాన్యం రాశులు మోంథా తుఫాన్‌తో తడవడంతో ధాన్యాన్ని ఆరబోసుకునేందుకు యార్డు ఆవరణలో స్థలసమస్య ఏర్పడిందన్నారు. తడిసిన ధాన్యం రాశులను కనీసం తిరగబోసుకునేందుకు కూడా స్థలం లేకపోవడంతో రైతుల మధ్య గొడవలు జరుగుతున్నాయన్నారు. దీనికి తోడు వాతావరణంలో ఏర్పడుతున్న మార్పుల వల్ల సమస్య మరింత జఠిలమయ్యే పరిస్థితి ఏర్పడడం, జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని రైతుల ప్రయోజనాల కోసం బయటి నుండి మార్కెట్‌యార్డు లోపలికి ధాన్యం తరలిరాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మార్కెట్ గేటుకు తాళం వేసినట్లు తెలిపారు. నవంబర్ 4 వరకు మార్కెట్‌యార్డు గేటుకు తాళం వేయనున్నట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించి కొనుగోలు ప్రారంభమైతే 4వ తేదీ నుంచి మార్కెట్‌యార్డు లోపలికి ధాన్యాన్ని అనుమతిస్తామన్నారు. రైతులు వాస్తవ పరిస్థితులను గమనించి ధాన్యం కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు సహకరించాలని కోరారు.
ఫ ధాన్యం రాశులతో
కొనుగోలు కేంద్రంలో స్థలం కొరత

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
