 
															మూసీకి పోటెత్తిన వరద
నకిరేకల్ : మూసీ ప్రాజెక్టుకు గురువారం ఎగువ నుంచి వరద పోటెత్తింది. అధికారులు తొమ్మిది క్రస్ట్ గేట్లను ఎత్తి వరదను దిగువకు వదులుతున్నారు. మోంథా తుపాను ప్రభావంతో హైదరాబాద్, జనగాం, ఆలేరు, వరంగల్ తదిరత ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో బిక్కేరు, వసంత వాగు, మూసీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆయా వాగుల ద్వారా గురువారం ఉదయం రిజర్వాయర్‌లోకి 49,791 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో గురువారం ప్రాజెక్టు ఏడు క్రస్ట్‌గేట్లను పది అడుగులు, రెండు క్రస్ట్‌గేట్లను ఐదు అడుగులు (మొత్తం 9గేట్లు) పైకెత్తి 51,990 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. సాయంత్రానికి ఇన్‌ఫ్లో 33,931 క్యూసెక్కులకు తగ్గటంతో అధికారులు ఒక గేటును మూసివేసి ఎనిమిది గేట్లను పది అడుగులకు ఎత్తి ఉంచి 33,931 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
