 
															నేటి నుంచి రైళ్ల పునరుద్ధరణ
భువనగిరి: సికింద్రాబాద్ నుంచి భువనగిరి మీదుగా విజయవాడ, విశాఖపట్నం వెళ్లే రైళ్లను శుక్రవారం నుంచి పునరుద్ధరించనున్నారు. మోంథా తుపాన్ కారణంగా ఆయా స్టేషన్లకు భువనగిరి మీదుగా వెళ్లే గౌతమి, గోదావరి, కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు చేసిన విషయం తెలిసిందే. డోర్నకల్‌లో వరద నీరు ఉండడంతో ఆయా రైళ్లను నల్లగొండ రైలు మార్గం గుండా వెళ్లేందుకు మళ్లించారు. అయితే ఇప్పటికే తెలంగాణ, దక్షిణ ఎక్స్‌ప్రెస్ రైళ్లు భువనగిరి మీదుగా ఢిల్లీకి వెళ్తున్నాయి. రద్దు చేసిన రైళ్లు శుక్రవారం నుంచి భువనగిరి మీదుగా వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మద్యం దుకాణంలో చోరీ
భువనగిరిటౌన్ : భువనగిరిలోని లక్ష్మి వైన్స్‌లో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. వైన్స్ వెనుక డోర్ ధ్వంసం చేసి లోనికి ప్రవేశించిన దొంగలు కౌంటర్ లోని రూ.50 వేల నగదు, ఐదు మద్యం ఫుల్ బాటిళ్లను అపహరించుకుపోయారు. సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ సైతం ఎత్తుకెళ్లారు. గురువారం ఉదయం వైన్స్ నిర్వాహకుడు షాపు తెరిచేందుకు రాగా చోరీ జరిగినట్లు గుర్తించారు. వైన్స్ నిర్వాహకుడు విజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇంటి పైకప్పు కూలి
రెండు ఆవులు మృతి
గుండాల : మండలంలోని వెల్మజాల గ్రామంలో రైతు నర్రముల యాదయ్యకు చెందిన రెండు ఆవులు మృతి చెందాయి. బుధవారం సాయంత్రం భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఆవులు వ్యవసాయ బావి పక్కన నిరుపయోగంగా ఉన్న ఇంట్లోకి వెళ్లాయి. వాటిని అక్కడే వదిలేసి ఇంటికి వచ్చాడు. గురువారం ఉదయం వెళ్లి చూడగా ఇంటి స్లాబ్ కూలి ఆవులు మృతి చెంది ఉన్నాయి. సుమారు రూ.లక్ష నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
