
ప్రజావాణి దరఖాస్తులను నిర్లక్ష్యం చేయొద్దు
భువనగిరిటౌన్ : ప్రజావాణి దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. అర్జీదారులు పదేపదే కలెక్టరేట్‌కు రాకుండా.. తక్షణమే పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. మొత్తం 45 అర్జీలు రాగా అత్యధికంగా రెవెన్యూ సమస్యలకు సంబంధించినవే ఉన్నాయి. రెవెన్యూకు సంబంధించిన వినతులు అధికంగా వస్తుండటంతో ఇకనుంచి తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు ప్రజావాణిలో పాల్గొనాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కర్‌రావు, డీఆర్‌ఓ తదితరులు పాల్గొన్నారు.