
కోతుల దాడిలో వృద్ధురాలికి గాయాలు
భూదాన్‌పోచంపల్లి: కోతుల దాడిలో వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం సాయంత్రం పోచంపల్లి పట్టణ కేంద్రంలో జరిగింది. పోచంపల్లి పట్టణ కేంద్రంలోని పదో వార్డులో జింకల వెంకటమ్మ ఒంటరి నివాసముంటోంది. మంగళవారం సాయంత్రం కోతుల గుంపు వెంకటమ్మ ఇంట్లోకి ప్రవేశించి ఆమైపె దాడి చేశాయి. భయంతో ఆమె బయటకు వచ్చే క్రమంలో కిందపడిపోయింది. దీంతో తుంటి ఎముక విరిగింది. ఇరుగుపొరుగు వారు వచ్చి కర్రలతో కోతులను తరిమేశారు. గాయపడిన వెంకటమ్మను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోచంపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో కోతుల బెడద నుంచి రక్షణ కల్పించాలని ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు.
తేలు కాటుతో నాలుగేళ్ల బాలుడు మృతి
నకిరేకల్: తేలు కాటుకు గురై నాలుగేళ్ల బాలుడు మృతిచెందాడు. నకిరేకల్ మండలం పాలెం గ్రామ శివారులోని టేకులగూడెంలో నివాసముంటున్న పక్కీరు పురుషోత్తంరెడ్డికి ఒక కుమారుడు, కుమార్తె సంతానం. కుమార్తె 3వ తరగతి చదువుతుండగా.. కుమారుడు రుత్విక్‌రెడ్డి(4) పాలెం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నర్సరీ చదువుతున్నాడు. గత నెల 29న రుత్విక్‌రెడ్డికి ఇంట్లో తల్లి స్నానం చేయించి అతడికి నిక్కర్ తొడిగింది. అప్పటికే నిక్కర్‌లో ఉన్న తేలు రుత్విక్‌రెడ్డిని కుట్టడంతో అతడు కేకలు వేశాడు. వెంటనే బాలుడిని నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతిచెందాడు. మృతుడి తండ్రి పురుషోత్తంరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
విద్యుదాఘాతంతో అపస్మారక స్థితిలోకి రైతు
ఫ సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది
వేములపల్లి: విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లిన రైతు ప్రాణాలను 108 సిబ్బంది సీపీఆర్ చేసి కాపాడారు. ఈ ఘటన వేములపలల్లి మండల కేంద్రం శివారులో మంగళవారం జరిగింది. మాడుగులపల్లి మండలం ఇసుకబాయిగూడెం గ్రామానికి చెందిన రైతు వల్లపుదాసు చంద్రయ్య మంగళవారం వేములపల్లి గ్రామ శివారులోని తన పొలం వద్ద బోరుకు మోటారు బిగించేందుకు వెళ్లాడు. బోరు మోటారు బిగిస్తుండగా విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సమీపంలోని రైతు మంచికంటి వెంకట్‌రెడ్డి గమనించి ఫోన్ ద్వారా 108 సిబ్బందికి, చంద్రయ్య కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. 108 సిబ్బంది వెలిజాల సైదులు, పగిళ్ల జానకిరాములు ఘటనా స్థలానికి చేరుకుని అపస్మారక స్థితిలో ఉన్న చంద్రయ్యకు సీపీఆర్ చేయగా అతడు స్పృహలోకి వచ్చాడు. వెంటనే అతడిని 108 వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చంద్రయ్య ప్రాణాలు కాపాడిన 108 సిబ్బందికి కుటుంబ సభ్యులు, రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
కొండమల్లేపల్లి: బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అదుపుతప్పి రోడ్డు పక్కన ఐరన్ గ్రిల్స్ ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన కొండమల్లేపల్లి మండల కేంద్రంలో మంగళవారం రాత్రి జరిగింది. వివరాలు.. కొండమల్లేపల్లి మండలం చింతకుంట్ల గ్రామానికి చెందిన ఐతరాజు అజయ్(22) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఐతరాజు అంజి కొండమల్లేపల్లిలోని ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి వీరిద్దరు బైక్‌పై కొండమల్లేపల్లి నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా.. మండల కేంద్రంలోని సాగర్ రోడ్డులో శక్రునాయక్‌తండా సమీపంలో గల పెట్రోల్ బంక్ వద్ద బైక్ అదుపుతప్పడంతో రోడ్డు పక్కన ఉన్న ఐరన్ గ్రిల్స్‌ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో అజయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై వెనుక కూర్చున్న అంజికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ అజ్మీరా రమేష్ తెలిపారు.