రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
దేవరకొండ: రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న గుర్తుతెలియని వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన పెద్దఅడిశర్లపల్లి మండలం చిల్కమర్రి సమీపంలో కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగింది. గుడిపల్లి ఎస్‌ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిపల్లి మండలం ఘణపురం గ్రామానికి చెందిన బొడ్డుపల్లి ఆంజనేయచారి తన ద్విచక్ర వానంపై ఆదివారం రాత్రి కొండమల్లేపల్లి నుంచి ఘణపురం గ్రామానికి వెళ్తుండగా.. పెద్దఅడిశర్లపల్లి మండలం చిల్కమర్రి గ్రామ స్టేజీ సమీపంలోకి రాగానే కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారి వెంట నడుచుకుంటూ వెళ్తున్న మతిస్థిమితం లేని గుర్తుతెలియని వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతడితో పాటు ఆంజనేయచారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని 108 వాహనంలో దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి గుర్తుతెలియని వ్యక్తి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఆంజనేయచారి తలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. మృతుడి వయస్సు సుమారు 25 నుంచి 30 ఏళ్లు ఉంటుందని, అతడి ఎడమ చేతిపై చమన్ అని ఇంగ్లిష్ అక్షరాలతో పచ్చబొట్టు ఉందని పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712670227 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ సూచించారు. చిల్కమర్రి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
జీవితంపై విరక్తితో యువకుడి ఆత్మహత్మ
దేవరకొండ: జీవితంపై విరక్తితో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం చింతపల్లి మండలం నసర్లపల్లి గ్రామంలో జరిగింది. చింతపల్లి ఎస్‌ఐ రామ్మూర్తి తెలిపిన విరాల ప్రకారం.. నసర్లపల్లి గ్రామానికి చెందిన జింకల శివ(32) హైదరాబాద్‌లోని కారు డ్రైవింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గతేడాది అతడి భార్య అనారోగ్యంతో మృతిచెందింది. అతడికి కూడా ఆరోగ్యం బాగోలేకపోవడం, కుటుంబ సమస్యల కారణంగా మనోవేదనకు గురవుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తితో సోమవారం మధ్యాహ్నం గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం అటుగా వెళ్లిన గ్రామస్తులకు శివ ఉరికి వేలాడుతూ కనిపించడంతో వెంటనే అతడి బంధువులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మద్యానికి బానిసై గొంతు కోసుకుని..
భువనగిరిటౌన్: మద్యానికి బానిసైన యువకుడు గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భువనగిరి పట్టణంలోని హనుమాన్‌వాడలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమాన్‌వాడకు చెందిన బి. నవీన్ (26) ప్లంబర్‌గా పనిచేస్తున్నాడు. అతడు మద్యానికి బానిసయ్యాడు. కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్న నవీన్ సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కుమారస్వామి తెలిపారు.
మంటల్లో ద్విచక్ర వాహనం దగ్ధం
నార్కట్‌పల్లి: నార్కట్‌పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యుడు గోరెమియా రోజుమాదిరిగా ఆదివారం రాత్రి తన బైక్‌ను ఇంటి ముందు పార్కింగ్ చేశాడు. అర్ధరాత్రి సమయంలో బైక్‌కు మంటలు అంటుకోవడంతో గోరెమియా గమనించి ఇంటి బయటికి వచ్చి చూసేసరికి బైక్ పూర్తిగా కాలిపోయింది. గుర్తుతెలియని వ్యక్తులు తన బైక్‌కు నిప్పంటించారని బాధితుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ క్రాంతికుమార్ సోమవారం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


