
ఫేక్ మనీ ట్రాన్స్‌ఫర్ యాప్‌తో మోసం
గరిడేపల్లి: గరిడేపల్లి మండలం అబ్బిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఓ యువకుడు ఫేక్ మనీట్రాన్స్‌ఫర్ యాప్ ద్వారా డబ్బులు పంపిస్తూ దొరికిపోయాడు. బుధవారం గరిడేపల్లిలోని ఓ వైన్స్‌లో మద్యం తీసుకున్న అతడు రూ.1200 ట్రాన్స్‌ఫర్ చేసినట్లు చూపించగా.. మెసేజ్ వచ్చినా డబ్బులు అకౌంట్‌లో జమకాకపోవడంతో అనుమానంతో యువకుడిని వైన్ షాప్ యాజమాని పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. దీనిపై పోలీసులు విచారణ చేసి ఇది చైన్ సిస్టంతో కూడుకున్న మోసంగా అనుమానిస్తున్నారు. యువకుడి సెల్‌ఫోన్, యాప్ మూలాలు, ఇతర వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఏడుగురి వ్యక్తుల రిమాండ్
ఆత్మకూరు(ఎం): ఆత్మకూరు(ఎం) మండలంలోని మొరిపిరాల గ్రామానికి చెందిన ఏడుగురు వ్యక్తులను రిమాండ్ చేసినట్లు ఏసీపీ పి. మధుసూదన్‌రెడ్డి బుధవారం పేర్కొన్నారు. భర్త, అత్తమామల వేధింపులు తాళలేక మొరిపిరాల గ్రామానికి చెందిన కటిక సంధ్య ఈ నెల 18న ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో ఓ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సంధ్య ఆత్మహత్యకు కారకులైన వారిని గుర్తించి రిమాండ్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. రిమాండ్ చేసిన వారిలో సంధ్య భర్త కటికె కృష్ణ, అత్త మారెమ్మ, మామ రాములుతో పాటు శివగణేష్, శ్రీను, రమ్య, వాణి ఉన్నట్లు పేర్కొన్నారు.
కృష్ణా నదిలో గల్లంతైన
వ్యక్తి మృతదేహం లభ్యం
హుజూర్‌నగర్: కృష్ణా నదిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం బుధవారం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్‌నగర్ మండలం చింత్రియాల గామానికి చెందిన బంగారు పార్వతీశంచారి(40) మంగళవారం సాయంత్రం పాత కిష్టాపురం గ్రామ పరిధిలో కృష్ణా నది పాయలో ఉన్న గేదెలను తోలేందుకు నదిలో ఈదుకుంటూ వెళ్లి గల్లంతయ్యాడు. అతడి ఆచూకీ కోసం పడవల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం మృతదేహం లభ్యమైంది. మృతుడికి భార్య లావణ్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ప్రొబెషనరీ ఎస్‌ఐ అజయ్‌కుమార్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడికి గాయాలు
చౌటుప్పల్: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామ శివారులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలయ్యాయి. లింగోజిగూడెం గ్రామానికి చెందిన మందోరి మహేష్ ద్విచక్ర వాహనంపై చౌటుప్పల్ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో గ్రామ సమీపంలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై గల అండర్‌పాస్ బ్రిడ్జిపై ముందు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. దీంతో వెనుకనే వస్తున్న మహేష్ బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మహేష్‌కు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతడిని హైదరాబాద్‌కు తరలించారు. మహేష్ అన్న సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు.