
తాళం వేసిన ఇంట్లో చోరీ
భువనగిరిటౌన్: భువనగిరి పట్టణంలో సోమవారం మధ్యాహ్నం తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణంలోని వసుంధర థియేటర్ ఎదురుగా నివాసముంటున్న ఆమిల్ రాకేష్ సోమవారం ఉదయం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లాడు. గుర్తుతెలియని వ్యక్తులు రాకేష్ ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించి బీరువాల్లో దాచిన రూ.2.60లక్షల నగదు, తులం బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. గేటు, ఇంటి దర్వాజా తీసి ఉండటం గమనించిన పక్కంటి వారు లోనికి వెళ్లి చూడగా కుటుంబ సభ్యులు ఎవరు లేకపోవడం, బీరువాలు తెరిచి ఉండటంతో చోరీ జరిగినట్లు గ్రహించి రాకేష్‌కు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ లక్ష్మీనారాయణ ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. రాకేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
మహిళ దుర్మరణం
తిప్పర్తి: తిప్పర్తి మండలం కేశరాజుపల్లి గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడి మృతిచెందింది. సోమవారం తిప్పర్తి ఎస్‌ఐ సాయిప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌కు చెందిన కల్లేపల్లి శ్రీనివాసరాజు, అతడి భార్య పుణ్యలక్ష్మి (54), మరదలు తిరుమలరాజు సుజాత కలిసి ఆదివారం సికింద్రాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా నాగండ్ల గ్రామానికి వెళ్తుండగా.. తిప్పర్తి మండలం కేశరాజుపల్లి గ్రామ సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పుణ్యలక్ష్మి బలమైన గాయాలయ్యాయి. శ్రీనివాస్‌రాజు, సుజాతలకు స్వల్ప గాయాలయ్యాయి. పుణ్యలక్ష్మిని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది. మృతురాలి భర్త శ్రీనివాసరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సాయిప్రశాంత్ తెలిపారు.
హత్య కేసులో నిందితులపై
పీడీ యాక్ట్ నమోదు
నూతనకల్: నూతనకల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన మెంచు చక్రయ్య హత్య కేసులో ఇద్దరు నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసి హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించినట్లు సీఐ నర్సింహారావు సోమవారం తెలిపారు. మార్చి 17న మెంచు చక్రయ్య హత్య జరగగా.. ఈ కేసులో ప్రధాన నింధితులైన కనకటి వెంకన్న అలియాస్ వెంకటేశ్వర్లు, కనకటి శ్రావణ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేశామని సీఐ పేర్కొన్నారు. కనకటి వెంకన్నపై 11 క్రిమినల్ కేసులు, కనకటి శ్రావణ్‌పై 7 క్రిమినల్ కేసులు ఉన్నాయని, వారు మళ్లీ ఇలాంటి నేరాలకు పాల్పడకూడదనే ఉద్దేశంతో పీడీ యాక్ట్ నమోదు చేసి సూర్యాపేట సబ్ జైలు నుంచి హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించినట్లు తెలిపారు.
యాదగిరి స్థానాచార్యులుగా ‘నల్లంథీఘల్’
● అదనపు బాధ్యతలు అప్పగింత
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రధానార్చకుడిగా విధులు నిర్వహిస్తున్న నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులకు స్థానాచార్యులుగా దేవాదాయశాఖ అధికారులు అదనపు బాధ్యతలు అప్పగించారు. గత కొన్నేళ్లుగా ఆలయ స్థానాచార్యుల పోస్టు ఖాళీగా ఉంది. దీంతో ఆ స్థానాచార్యుల పోస్టును ఆలయ ప్రధానార్చకుడిగా విధులు నిర్వహిస్తున్న నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులకు అదనంగా బాధ్యతలను అప్పగిస్తు ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయంలో పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా పూజల్లో స్థానాచార్యులు కీలకంగా బాధ్యతలు నిర్వహించనున్నారు.
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సోమవారం స్వామివారి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కల్యాణాన్ని కమనీయంగా జరిపించారు. అదేవిధంగా క్షేత్రంలోని శివాలయంలో శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామికి ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక చైర్మన్ చెన్నూరు విజయ్‌కుమార్, ఈఓ, అర్చకులు పాల్గొన్నారు.