
చోరీ కేసులో నిందితుల అరెస్ట్
నల్లగొండ: ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను నకిరేకల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి సోమవారం తన కార్యాలయంలో విలేకరులకు వెల్లడించిన వివరాల ప్రకారం.. నకిరేకల్ పట్టణంలోని వీటీకాలనీలో ఒంటరిగా నివాసముంటున్న నాగులవంచ లక్ష్మమ్మ ఇంటికి ఈ నెల 17న ముగ్గురు వ్యక్తులు వచ్చి ఆమైపె దాడి చేసి, చేతులు కట్టేసి 3 తులాల బంగారు పుస్తెలతాడు, 4 రోల్డ్ గోల్డ్ గాజులు అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆదివారం సాయంత్రం నకిరేకల్ పట్టణంలోని తిప్పర్తి ఫ్లైఓవర్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులను చూసి యాక్టీవాపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు పారిపోతుండగా వారిని పట్టుకుని పట్టుకుని విచారించగా వారి వద్ద పుస్తెలతాడు దొరికింది. లక్ష్మమ్మపై దాడి చేసి చోరీ చేసింది తామేనని నిందితులు సత్యారం కృష్ణ అలియాస్ కృష్ణమూర్తి, మామిడి బాలకృష్ణ ఒప్పుకున్నారు. వీరితో పాటు మరో ఇద్దరు మల్లం నర్సింహ, ముష్టి వెంకటేశ్ కూడా ఈ చోరీలో పాలుపంచుకున్నారని డీఎస్పీ తెలిపారు. సత్యారం కృష్ణ మీద 31 కేసులు, మామిడి బాలకృష్ణపై 13 కేసులు, ముష్టి వెంకటేశ్‌పై ఒక కేసు ఉన్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. మల్లం నర్సింహ, మామిడి బాలకృష్ణ ఆరు నెలల క్రితం దొంగతనం కేసులో అరైస్టె చంచల్‌గూడ జైలులో కలిశారని, ఆ సమయంలో ఒంటరిగా ఉన్న మహిళలపై దాడి చేసి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సీఐ రాజశేఖర్, ఎస్‌ఐలు లచ్చిరెడ్డి, సైదులు, సాయిప్రశాంత్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, రమేష్, సునీల్, కె. రవి పాల్గొన్నారు.
లారీని ఢీకొని గాయాలు
నాగారం: సూర్యాపేట–జనగామ జాతీయ రహదారిపై నాగారం బంగ్లా సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్ మండలం ఇస్తాలపురం గ్రామానికి చెందిన మున్న ప్రవీణ్ బైక్‌పై తిరుమలగిరి వైపు వెళ్తున్నాడు. నాగారం బంగ్లా సమీపంలోకి రాగానే బైక్ అదుపుతప్పడంతో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ప్రవీణ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.