
ఏఎమ్మార్పీ కాలువలో పడి వృద్ధురాలి గల్లంతు
పెద్దఅడిశర్లపల్లి: ప్రమాదవశాత్తు ఏఎమ్మార్పీ ప్రధాన కాలువలో పడి వృద్ధురాలు గల్లంతయ్యింది. ఈ ఘటన పెద్దఅడిశర్లపల్లి మండలంలో సోమవారం చోటు చేసుకుంది. గుడిపల్లి మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన ఓర్సు వెంకటమ్మ(60) సోమవారం పెద్దఅడిశర్లపల్లి మండలం వడ్డరిగూడెంలో ఉంటున్న తన కుమార్తె వద్దకు వచ్చి అక్కంపల్లి రిజర్వాయర్ కట్టపై నడుచుకుంటూ వెళ్తూ ఏకేబీఆర్ హెడ్ రెగ్యూలేటర్ వద్ద గల ఏఎమ్మార్పీ ప్రధాన కాలువలో నీరు తాగేందుకు ప్రయత్నిస్తూ కాలువలో జారిపడి కొట్టుకుపోయింది. స్థానికులు గమనించి గుడిపల్లి పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్‌ఐ నర్సింహులు ఘటనా స్థలానికి చేరుకొని నీటి విడుదలను నిలిపివేసి గాలింపు చర్యలు చేపట్టినా ఆమె ఆచూకీ లభించలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
బైక్ అదుపుతప్పి కాలువలో పడి..
వలిగొండ: బైక్ అదుపుతప్పి కాలువలో పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన వలిగొండ మండలంలోని ఎదుళ్లగూడెం గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మండలం వెలిమినేడుకు చెందిన అంతటి అజయ్‌కుమార్(26) ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం వలిగొండ మండలం పొద్దుటూరులోని తన బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్నాడు. తిరుగు ప్రయాణంలో ఏదులగూడెం సమీపంలో బైక్ అదుపుతప్పి కాలువలో పడి మృతిచెందాడు. వెనుక నుంచి వస్తున్న వ్యక్తి ప్రమాదాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి వెళ్లి పోస్టుమార్టం నిమిత్తం అజయ్‌కుమార్ మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి అంజయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ యుగంధర్ తెలిపారు.