
చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తాం
చౌటుప్పల్ : రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యంలో చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని, ఆందోళన చెందవద్దని అదనపు కలెక్టర్ వీరారెడ్డి పేర్కొన్నారు. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించి ధాన్యాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుని భరోసా ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు రూ.555 కోట్ల విలువ చేసే 2.70లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఈనెల 17వ తేదీ వరకు రూ.470 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయినట్లు తెలిపారు. 375 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేపట్టగా, అందులో 100 సెంటర్లలో ధాన్యం సేకరణ పూర్తయినట్లు చెప్పారు. రూ.250 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. కాంటా వేసిన ధాన్యాన్ని 675 లారీల ద్వారా ఎప్పటికప్పుడు మిల్లులకు ఎగుమతి చేస్తున్నట్లు వెల్లడించారు. చౌటుప్పల్, భూదాన్‌పోచంపల్లి, వలిగొండ, సంస్థాన్‌నారాయణపురం, రామన్నపేట మండలాల్లో వచ్చే నెలలో కూడా కొనుగోళ్లు జరిగే అవకాశం ఉందన్నారు. అంతకుముందు మార్కెట్ యార్డులో ప్యాడీ క్లీనర్ పనితీరు అదనపు కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, సింగిల్‌విండో చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, తహసీల్దార్ హరికృష్ణ, మార్కెట్ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, వ్యవసాయాధికారి ముత్యాల నాగరాజు, మార్కెట్ సెక్రటరీ రవీందర్‌రెడ్డి, పీఏసీఎస్ సీఈవో ఎరుకల రమేష్, పబ్బు రాజుగౌడ్, మొగుదాల రమేష్, బొబ్బిళ్ల మురళి, పబ్బు శ్రీకాంత్, సప్పిడి సంజీవరెడ్డి, ఎండి.గౌస్‌ఖాన్, దాచేపల్లి విజయ్, బోయ వెంకట్, వెంకటేశం, రాజశేఖర్‌రెడ్డి, పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ వీరారెడ్డి