
సమస్యలు పరిష్కరించాలని ధర్నా
భువనగిరిటౌన్ : దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకట్ మాట్లాడుతూ దివ్యాంగులు 30 రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అవన్నీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం పథకంలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సురుపంగ ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి వన ఉపేందర్, సామాజిక ఉద్యమ నేత బట్టు రామచంద్రయ్య, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లేపల్లి స్వామి, జిల్లా కోశాధికారి కొత్త లలిత, ఉపాధ్యక్షురాలు బర్ల పార్వతి, మాదిరే పద్మ, బల్గురు అంజయ్య పాల్గొన్నారు.
‘ప్రీ లిటిగేషన్’ ద్వారా కేసులు పరిష్కరించుకోవచ్చు
భువనగిరి : కోర్టుకు లేదా ఫోరం ముందుకు రాలేని వయోవృద్ధులు ప్రీ లిటిగేషన్ వాజ్యాల ద్వారా సివిల్ కేసులను పరిష్కరించుకోవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి మాధవీలత సూచించారు. భువనగిరి మండలం చీమలకొండూరు పరిధిలో గల బెజ్జ లక్ష్మయ్య ఫౌండేషన్ అశ్రమంలో ఉంటున్న ఓ వృద్ధురాలు తన కుమారులు తన బాగోగులు చూడటం లేదని న్యాయ సేవాధికారి సంస్థకు దరఖాస్తు చేసుకుంది. జడ్జి మాధవీలత శుక్రవారం బాధితురాలి దరఖాస్తును పరిశీలించారు. వృద్ధురాలి కుమారులను పిలిపించి ప్రతి నెలా రూ.20 వేలు ఇవ్వడంతో పాటు ఆమె బాగోగులను చూసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి ఉషశ్రీ తదితరులు ఉన్నారు.
20న ఉచిత వైద్యశిబిరం
సంఘటిత, అసంఘటిత కార్మికుల కోసం జిల్లా కార్మిక శాఖ, న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 20న ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు జడ్జి మాధవీలత తెలిపారు. వైద్య శిబిరాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సర్టిఫికెట్‌లు ప్రదానం
నల్లగొండ టూటౌన్ : సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్సీ సంస్థ నిర్వహించిన నైపుణ్య శిక్షణ అభివృద్ధి (టాస్క్)కి సహకరించిన యూనివర్సిటీ సిబ్బందికి శుక్రవారం ఎంజీయూ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ సరిఫికెట్లు, మెమొంటోలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్సీని టాస్క్‌ను రూ.30 లక్షలతో ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ అల్వాల్ రవి, డాక్టర్ వై.ప్రశాంతి, సుధారాణి, జయంతి, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
ప్రైవేట్ స్కూళ్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
భువనగిరి : బెస్ట్ అవైలబుల్ స్కీం కింద 2025–26 విద్యా సంవత్సరంలో ఎస్సీ విద్యార్థులకు 1వ తరగతిలో డే స్కాలర్, 5వ తరగతిలో రెసిడెన్షియల్‌లో ప్రవేశం కల్పిచేందుకు అర్హత కలిగిని ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు దరఖాస్తు చేసుకోవాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ నెల 25వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని, ఇతర వివరాలకు ఎస్సీ అభివృద్ధి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
ఆర్టీసీలో టెండర్లు
రామగిరి(నల్లగొండ): ఆర్టీసీ నల్లగొండ రీజియన్‌లోని బస్ స్టేషన్లలో పలు పనులకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు రీజనల్ మేనేజర్ జానిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ బస్ స్టేషన్లలో ఖాళీ షాపులు, వాహన పార్కింగ్, లాజిస్టిక్ సర్వీసెస్ నిర్వహణకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల వారు www.tgrtc.teangana.gov.in వెబ్‌సైట్‌ను, ఆన్‌లైన్ టెండర్‌లో పాల్గొనేందుకు www. tender.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు. మరిన్ని వివరాలకు రీజనల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అధికారి 73828 34223 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

సమస్యలు పరిష్కరించాలని ధర్నా