
యువకుడి ప్రాణం తీసిన చేపల వేట
కనగల్ : చేపల వేట యువకుడి ప్రాణం తీసింది. ఈ ఘటన కనగల్ మండలం పగిడిమర్రి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పగిడిమర్రి గ్రామానికి చెందిన అబ్బిడి నాగర్జున్‌రెడ్డి(36) వ్యవసాయంతో పాటు మెటార్ మెకానిక్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఉదయం పగిడిమర్రి గ్రామానికే చెందిన కొప్పుల ప్రవీణ్ బోరు మోటారు కాలిపోగా.. దానిని బయటకు తీసిన అనంతరం సమీపంలోనే ఉన్న నోములవారి కుంటలోకి నాగార్జున్‌రెడ్డి చేపల వేటకు వెళ్లాడు. చేపలు పట్టేందుకు కుంటలోకి దిగిన కొన్ని క్షణాల్లోనే నాగర్జున్‌రెడ్డి అందులో మునిగిపోయాడు. అక్కడే ఉన్న ప్రవీణ్ గమనించి గ్రామస్తులకు సమాచారం అందించాడు. గ్రామస్తులు ఎంత వెతికినా కుంటలో నాగార్జున్‌రెడ్డి ఆచూకీ లభించకపోవడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది 4గంటల పాటు శ్రమించి నాగార్జున్‌రెడ్డి మృతదేహన్ని కుంటలో నుంచి బయటకు తీశారు.
కరెంట్ షాక్‌తో మృతిచెందాడా..?
నాగర్జున్‌రెడ్డితో పాటు మరో ఐదుగురు యువకులు కూడా చేపల వేటకు వెళ్లినట్లు తెలుస్తోంది. వీరు కరెంట్ సహాయంతో చేపలు పట్టేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే నాగర్జున్‌రెడ్డి విద్యుదాఘాతానికి గురై మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతుడికి ఈత వచ్చని, చిన్న కుంటలో మునిగిపోయే అవకాశమే లేదని గ్రామస్తులు, బంధువులు పేర్కొంటున్నారు. గతంలో ఇదే గ్రామానికి చెందిన ఇద్దరు కరెంట్ సహాయంతో చేపలు పట్టేందుకు వెళ్లి మృత్యువాత పడ్డారు. ఈ క్రమంలోనే వారం క్రితం గ్రామ పరిధిలోని కుంటల్లో కరెంట్ సహాయంతో చేపలు పడితే రూ.10వేల జరిమానా విధిస్తామని డప్పు చాటింపు కూడా వేయించినట్లు మాజీ సర్పంచ్ గోలి నర్సిరెడ్డి తెలిపారు.
గ్రామంలో విషాధచాయలు..
నాగర్జున్‌రెడ్డి మృతితో పగిడిమర్రి గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో నాగార్జున్‌రెడ్డి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడికి 3వ తరగతి చదివే కుమార్తె, 1వ తరగతి చదివే కుమారుడు ఉన్నాడు. నాగార్జున్‌రెడ్డి భార్య కోమలి ఏడుస్తున్న తీరు చూసి గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. తహసీల్దార్ పద్మ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందించలేదని పోలీసులు తెలిపారు.
కుంటలో మునిగి మృతి
కనగల్ మండలం పగిడిమర్రిలో ఘటన