
అందగత్తెలకు ఆతిథ్యం
నేడు భూదాన్‌పోచంపల్లి, యాదగిరిగుట్టలో మిస్ వరల్డ్ పోటీదారుల పర్యటన
సాక్షి, యాదాద్రి, యాదగిరిగుట్ట, భూదాన్‌పోచంపల్లి : మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. యాదగిరిగుట్ట క్షేత్రాని ఓ బృందం, భూదాన్‌పోచంపల్లిలో మరో బృందం సందడి చేయనుంది. వీరి పర్యటన కోసం టూరిజం శాఖతోపాటు జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేసింది. పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.
నారసింహుడి క్షేత్రంలో ప్రత్యేక పూజలు
వివిధ దేశాలకు చెందిన పది మంది సుందరీమణుల బృందం గురువారం సాయంత్రం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రానికి రానుంది. వీరు ప్రత్యేక బస్సులో హైదరాబాద్ నుంచి యాదగిరి కొండపైకి చేరుకుంటారు. కొండపైన అతిథి గృహం నుంచి ప్రత్యేక బ్యాటరీ వాహనాల్లో అఖండ దీపారాధన వద్దకు చేరుకుని దీపాలు వెలిగిస్తారు. అనంతరం గర్భాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. సువర్ణ పుష్పార్చనలో పాల్గొంటారు. వేద పండితులు సుందరీమణులకు ఆశీర్వచనం చేసి, శ్రీస్వామి వారి చిత్రపటాలు, లడ్డూ ప్రసాదాలను అందజేస్తారు. దర్శనం తర్వాత ముఖ మండపంలో పలు ప్రాంతాలను వీక్షిస్తారు. అనంతరం స్వర్ణ విమాన గోపురం వద్ద ఆలయమంతా కనిపించేలా ఫొటోలు దిగుతారు.
ఆలయంలో ఏర్పాట్లు.. బ్రేక్ దర్శనం రద్దు
సుందరీమణులు యాదగిరి క్షేత్రానికి వస్తున్న నేపథ్యంలో ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రధానాలయ ముఖ మండపం, మహా రాజగోపురాలను అలంకరించారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం భక్తులకు కల్పించే బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. దీంతో పాటు జోడు సేవలను రద్దు చేశారు. సుందరీమణులు వెళ్లిన తరువాత భక్తులకు శ్రీస్వామి వారి దర్శనాలను కొనసాగిస్తారు.
పోచంపల్లికి 25 మంది అందాలభామలు
ఇక్కత్ వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచి, యునెస్కో అనుబంధ సంస్థచే ఉత్తమ పర్యాటక గ్రామంగా అంతర్జాతీయ అవార్డు అందుకున్న భూదాన్‌పోచంపల్లిని గురువారం సాయంత్రం 6 గంటలకు 25 మంది సుందరీమణులు సందర్శిస్తారు. టూరిజం పార్కులోని మ్యూజియంలో దారం నుంచి చేనేత వస్త్రాల తయారీ ప్రక్రియలను పరిశీలిస్తారు. వీరికి సింగిల్ ఇక్కత్, డబుల్ ఇక్కత్, తేలియా రుమాలు, చేనేత వస్త్రాల ప్రాముఖ్యతను వివరిస్తారు. హంపీ థియేటర్‌లో మోడల్స్‌చే నిర్వహించే ర్యాంప్ వాక్‌ను తిలకిస్తారు. పద్మశ్రీ గజం గోవర్ధన్, జాతీయ, రాష్ట్ర అవార్డు గ్రహీతలైన తడక రమేశ్, సాయిని భరత్, బోగ బాలయ్య, ఎన్నం మాధవి శివకుమార్, చేనేత సహకార సంఘం, పోచంపల్లి టై అండ్ డై అసోషియేషన్ల ఆధ్వర్యంలో పది స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.
సంస్కృతికి పెద్దపీట
కాగా టూరిజం పార్కులో చేనేతకు ప్రాధాన్యతమిస్తూనే మన సంస్కృతి, సంప్రదాయాలు, గ్రామీణ వాతావరణం ప్రతిబింబించేలా పెద్దపీట వేస్తూ అధికారులు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ పండుగల ప్రాశస్థ్యాన్ని తెలియజేసే బతుకమ్మ, ఎడ్లబండి ప్రదర్శన, పల్లెలోని గుడిసె సెట్ వేసి అందులో చేనేత స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రపంచ సుందరీమణులకు స్థానిక మహిళలు బొట్టుపెట్టడం, పూలమాలలు వేసి సత్కరించనున్నారు. ఈ సందర్భంగా టూరిజం పార్కుతోపాటు పలు ప్రాంతాలను రంగురంగుల లైట్లతో తీర్చిదిద్దారు.
ఫ శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్న సుందరీమణులు
ఫ టూరిజం పార్కులో చేనేత వస్త్రాల తయారీ ప్రక్రియల పరిశీలన
ఫ ఏర్పాట్లు పూర్తిచేసిన యంత్రాంగం
యాదగిరిగుట్టలో పర్యటన ఇలా..
అందగత్తెలు సాయంత్రం 5 గంటలకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం అతిథిగృహానికి చేరుకుంటారు.
5:10– 5:20 గంటల వరకు అఖండ దీపారాధనలో పాల్గొంటారు.
5:20 – 5:30 వరకు స్థానిక కళాకారుల కోలాటం, సంప్రదాయ భజన, శాసీ్త్రయ నృత్యబృందాలతో తూర్పు గోపురానికి వెళ్తారు.
5:30 – 5:40 ఆలయ ప్రాంగణంలో ఫొటోషూట్
5:50– 6 గంటల వరకు గర్భాలయంలో ప్రత్యేక పూజ, పంచనారసింహస్వామి దర్శనం
6:10 – 6:25 వరకు ఆలయ ప్రాంగణంలో గల శిల్పకళపై ఫొటో సెషన్.
6.30 – 6.40 : ఆలయ ప్రొటోకాల్ గెస్ట్ హౌస్‌లో అతిథులకు టీ, స్నాక్స్ అనంతరం కొంతసేపు సేదదీరుతారు.
సాయంత్రం 6:40 గంటలకు గెస్ట్ హౌస్ నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో తిరిగి హైదరాబాద్ వెళ్తారు.
పోచంపల్లిలో..
సాయంత్రం 6 గంటలకు పోచంపల్లి టూరిజం పార్క్‌కు చేరుకుంటారు.
6:10 గంటల వరకు కోలాట బృందాలు తెలంగాణ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలుకుతాయి.
6:10 నుంచి 6:25 గంటల వరకు మ్యూజియం టూర్, మగ్గం వర్క్ గురించి వారికి చేనేత కళాకారులు వివరిస్తారు.
టూరిజం పార్క్ ప్రాంగణంలో మెహందీ, లైవ్ మ్యూజిక్ కార్యక్రమంలో పాల్గొంటారు.
రాత్రి 7:05 నుంచి7:30 గంటల వరకు మిస్ వరల్డ్ పోటీదారులు చేనేత జౌళి శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు.
7:40 నుంచి 7:45 : తెలంగాణ టూరిజం రూపొందించిన అధికారిక వీడియో ప్రదర్శనను వీక్షిస్తారు.
7:45 నుంచి 8:15 గంటల వరకు తెలంగాణ హ్యాండ్లూమ్ ప్రదర్శన ఉంటుంది. ఇక్కడే స్థానిక మోడల్స్ తెలంగాణ చేనేత వస్త్రాలతో తయారు చేసిన దుస్తులను ధరించి సుందరీమణుల ముందు ప్రదర్శిస్తారు.
8:30 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.

అందగత్తెలకు ఆతిథ్యం

అందగత్తెలకు ఆతిథ్యం