
మిస్ వరల్డ్ పోటీదారులకు అసౌకర్యం కలగొద్దు
భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లికి రానున్న మిస్ వరల్డ్ పోటీదారులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా చూడాలని పోచంపల్లి ప్రోగ్రామ్ ఇన్‌చార్జ్, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్, ఐఏఎస్ డాక్టర్ లక్ష్మి అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ హనుమంతరావు, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌తో కలిసి పోచంపల్లి టూరిజం పార్కును సందర్శించారు. అక్కడ చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. స్వాగతం పలకడం నుంచి చివరి ప్రొగ్రామ్ ర్యాంప్‌వాక్ వరకు చేస్తున్న కార్యక్రమాలపై రిహార్సల్స్ చేపట్టారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ గురువారం సాయంత్రం 6 గంటలకు ఆఫ్రికా దేశాలకు చెందిన 25 మంది సుందరీమణులు పోచంపల్లికి రానున్న సందర్భంగా న్నారు. టూరిజం పార్కులో ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు చేనేత వస్త్రాల ప్రాముఖ్యత, వస్త్రాల తయారీ విధానాలను స్వయంగా తెలుసుకొంటారని అన్నారు. అలాగే హంపీ థియేటర్‌లో 20 మంది మోడల్స్‌చే ఇండో వెస్ట్రన్ కలగలిపిన చేనేత వస్త్రాలతో నిర్వహించే ర్యాంప్‌వాక్‌ను తిలకిస్తారన్నారు. కాగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, జిల్లాలోని ప్రముఖులు, పద్మశ్రీలు, చేనేతలో అవార్డుగ్రహీతలను ఆహ్వానించామని పేర్కొన్నారు. కార్యక్రమం అనంతరం తిరిగి రాత్రి హైదరాబాద్‌కు వెళ్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం జీఎం ఉపేందర్‌రెడ్డి, డీపీఓ సునంద, డీసీపీ అకాంశ్‌యాదవ్, ఏసీపీ మధుసూధన్‌రెడ్డి, ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, సీఐ రాములు, మున్సిపల్ కమిషనర్ అంజన్‌రెడ్డి, ఇన్‌చార్జ్ తహసీల్దార్ నాగేశ్వర్‌రావు, ఎంఆర్‌ఐ గుత్తా వెంకట్‌రెడ్డి, నాయకులు తడక వెంకటేశం, పాక మల్లేశ్, తడక రమేశ్, భారత లవకుమార్, మర్రి నర్సింహారెడ్డి తదితరులు ఉన్నారు.
ఫ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మి