
భువనగిరిలో సుందరాంగుల విందు
భువనగిరిటౌన్: వివిధ దేశాలకు చెందిన 72 మంది మిస్ వరల్డ్ పోటీదారులు బుధవారం హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వెళ్తూ మార్గమధ్యలో భువనగిరిలోని వివేరా హోటల్‌లోని వి కన్వెన్షన్ హాల్‌లో కొద్దిసేపు ఆగారు. 34 మందితో కూడిన మొదటి బృందం మధ్యాహ్నం 12.45గంటలకు మూడు బస్సుల్లో వి కన్వెన్షన్ హాల్‌కు చేరుకుని ఒక గంట పదిహేను నిమిషాల పాటు సేదతీరారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు వారు వరంగల్‌కు ప్రయాణమయ్యారు. అనంతరం 22 మందితో కూడిన రెండో బృందం సుమారు 25 నిమిషాల పాటు వి కన్వెన్షన్ హాల్‌లో స్నాక్స్ తిని వెళ్లారు. భువనగిరి ఖిలాను బస్సుల్లో నుంచి సుందరీమణులు తిలకించారు.
సంప్రదాయ వంటకాలు వడ్డింపు..
సుందరీమణులకు వి కన్వెన్షన్ హాల్‌లో వారివారి దేశాలకు చెందిన 19 రకాల సంప్రదాయ వంటలను వివేరా హోటల్ యజమానులు తయారు చేసి వడ్డించారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ స్వాతి ఆధ్వర్యంలో వంటకాలను తనిఖీ చేసిన అనంతరం వారికి విందు భోజనం పెట్టారు. అనంతరం వారు కన్వెక్షన్ హాల్‌లో కలియ తిరిగారు.
120 మంది పోలీసులతో భద్రత
అందాల భామలు వస్తున్న నేపథ్యంలో వి కన్వెన్షన్ హాల్ వద్ద 120మంది పోలీసులతో భారీ భద్రత కల్పించారు. హోటల్‌కు వచ్చే వారిని పాసులు ఉంటేనే అనుమతి ఇచ్చారు. భద్రతా ఏర్పాట్లను రాచకొండ సీపీ సుధీర్‌బాబు, భువనగిరి డీసీపీ అక్షామ్స్‌యాదవ్, ఏఎస్పీ కంకణాల రాహుల్‌రెడ్డి, పట్టణ ఇన్‌స్పెక్టర్ రమేష్ పరిశీలించారు. అంతకుముందు సుందరీమణులకు హోటల్ యజమాని సద్ది వెంకట్‌రెడ్డి స్వాగతం పలికారు. గూడూరు టోల్‌ప్లాజా నుంచి ప్రధాన చౌరస్తాల వద్ద కూడా పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు.
వరంగల్ పర్యటనకు వెళ్తూ మధ్యలో ఆగిన 56 మంది అందాల భామలు
ఖిలాను ఆసక్తిగా తిలకించిన అందగత్తెలు
భామలను చూసి కేరింతలు
ఆలేరు: ఆలేరు మీదుగా వరంగల్‌కు ప్రత్యేక బస్సుల్లో వెళ్తున్న సుందరీమణులను చూసేందుకు బహుపేట క్రాస్ రోడ్ నుంచి పెంబర్తి కాకతీయ కమాన్ వరకు బుధవారం స్థానికులు గుమిగూడారు. మధ్యాహ్నం 2.50గంటలకు బస్సు ఆలేరు సాయిబాబా గుడి సమీపంలోకి చేరుకోగానే స్థానికులు కేరింతలు కొట్టగా.. ప్రతిస్పందనగా సుందరీమణులు అభివాదాలు చేశారు. సుందరీమణులు ప్రయాణించే రూట్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఆలేరు సీఐ కొండల్‌రావు, ఎస్‌ఐ రజనీకర్ ఆధ్వర్యంలో ఏఎస్‌ఐ అంజనేయులుతో పాటు 25 మంది కానిస్టేబుళ్లు, 10మంది ట్రాఫిక్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.

భువనగిరిలో సుందరాంగుల విందు