
అమెరికాలో పందెనపల్లి యువతి మృతి
● స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తి
కట్టంగూర్: ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన కట్టంగూర్ మండలం పందెనపల్లి గ్రామానికి చెందిన యువతి బ్రెయిన్‌డెడ్ అయ్యి మృతిచెందింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు, యువతి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పందెనపల్లి గ్రామానికి చెందిన కొండి వెంకట్‌రెడ్డి, శోభారాణి దంపతుల కుమార్తె ప్రియాంకరెడ్డి(26) అమెరికాలోని అలబామా స్టేట్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ ఎమ్మెస్సీ(మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ అగ్రికల్చర్) పూర్తిచేసి అక్కడే పార్ట్‌టైం జాబ్ చేస్తోంది. ప్రియాంక ఈ నెల 6వ తేదీన తాను ఉంటున్న ఇంట్లోని బాత్‌రూంలో పడిపోయింది. స్నేహితులు గమనించి ఆమెను ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. ఒక రోజు చికిత్స అందించిన వైద్యులు ప్రియాంక తల్లిదండ్రులతో మాట్లాడి వెంటిలేటర్ తీసివేయటంతో ఈ నెల 8న ఆమె మృతిచెందింది.ప్రియాంక మృతదేహం బుధవారం స్వగ్రామం పందెనపల్లికి చేరుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల అశ్రునయనాల మధ్య ప్రియాంక అంత్యక్రియలు పూర్తిచేశారు.
కుటుంబ తగాదాలతో వివాహిత ఆత్మహత్య
చౌటుప్పల్ రూరల్: కుటుంబ తగాదాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొయ్యలగూడెం గ్రామానికి చెందిన గోశిక భాస్కర్‌కు అదే గ్రామానికి చెందిన నవ్య(34)తో 11ఏళ్ల క్రితం వివాహం జరిగింది. భాస్కర్ చేనేత కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నవ్య భర్తకు చేదోడువాదోడుగా ఉంటోంది. భాస్కర్ ఇటీవల కాలంలో మద్యానికి బానిస కావడంతో కుటుంబంలో తగాదాలు జరుగుతున్నాయి. మంగళవారం భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. క్షణికావేశంలో నవ్య చేనేత రంగుల్లో ఉపయోగించే నైట్రేట్ రసాయానాన్ని తాగింది. ఇది గమనించిన భాస్కర్ ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతురాలి తమ్ముడు రాఘవేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి. మన్మథకుమార్ తెలిపారు.
స్వర్ణగిరీశుడికి తిరువీధి ఉత్సవ సేవ
భువనగిరి: భువనగిరి పట్టణంలోని స్వర్ణగిరి ఆలయంలో వేంకటేశ్వర స్వామికి బుధవారం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో సుభ్రబాత సేవ, తోమాల సేవ, సహస్రనామార్చన, అష్టదళ పాదపద్మార్చన సేవ, నిత్య కల్యాణ మహోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం సుమారు 3వేల మందికి అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం స్వామివారికి మంగళహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

అమెరికాలో పందెనపల్లి యువతి మృతి