
అమరవీరుల స్ఫూర్తితోనే రాష్ట్రంలో ప్రజాపాలన
శాలిగౌరారం: అమరవీరుల స్ఫూర్తితోనే తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాపాలనను అందిస్తున్నారని ఏఐసీసీ నాయకుడు, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హన్మంతరావు అన్నారు. శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన వారికి స్మారక స్థూపం నిర్మించేందుకు బుధవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరుల త్యాగాలను గుర్తిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకోసం సాహసోపేతమైన నిర్ణయాలతో ముందుకు సాగుతోందన్నారు. ఆనాడు రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలకు ఉమ్మడి నల్లగొండ జిల్లానే కేంద్రబిందువు అయ్యిందని అన్నారు. దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మతో పాటు అనేక మంది పోరాటంతోనే నిజాం పాలన నుంచి విముక్తి కలిగిందన్నారు. చరిత్ర తెలియకుండా కొంతమంది నాయకులు తమ ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు సరికాదన్నారు. వల్లాల అవరవీరుల కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటామన్నారు. తన సొంత ఖర్చులు రూ.3లక్షలతో అమరవీరుల స్మారక స్థూపం నిర్మాణ పనులను ఆగస్టు 15 నాటికి పూర్తిచేసి సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరింపజేస్తానన్నారు. భూమి పూజ తర్వాత ఆయన స్వయంగా కంకర, ఇసుక, సిమెంట్‌ను తలపై మోసి తాపీ మేసీ్త్రలకు అందించారు. కార్యక్రమంలో ఏఐసీసీ నాయకుడు ఎంఏ బాసిత్, పీసీసీ నాయకుడు శ్రీకాంత్‌గౌడ్, డీసీసీ ఉపాధ్యక్షుడు అన్నెబోయిన సుధాకర్, దండ అశోక్‌రెడ్డి, శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరిగె నర్సింహ, మాజీ సర్పంచ్ షేక్ ఇంతియాజ్, మాధారంకలాన్ మాజీ ఎంపీటీసీ నోముల జనార్దన్, కట్టంగూరి శ్రీను, సురేందర్‌రెడ్డి, విజయ్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హన్మంతరావు