
రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించొద్దు
సాక్షి,యాదాద్రి : రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించొద్దని, నాణ్యత లేని విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లక్ష్మీనారాయణ హెచ్చరించారు. నకిలీ విత్తనాలు అరికట్టడంలో భాగంగా మంగళవారం కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులు సంయుక్తంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నకిలీ విత్తనాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ మాట్లాడుతూ.. విత్తనాల లైసెన్స్ కలిగిన విత్తన డీలర్ నుంచి మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు చేసిన విత్తనాలకు రశీదు పొందాలన్నారు. విత్తన నాణ్యత లోపం వల్ల కలిగే పంట నష్టాన్ని నిర్ధారించి, పంట నష్ట పరిహారం ఇప్పించడానికి విత్తన కొనుగోలు రశీదు తప్పనిసరి అని పేర్కొన్నారు. వ్యవసాయ, పోలీస్ శాఖ అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, వీరు నకిలీ విత్తనాలు అమ్మే వారిపై నిఘా పెట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారన్నారు. అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఎమ్మార్పీ రేటు కన్నా ఎక్కువకు విత్తనాలు కొనగోలు చేయొద్దని సూచించారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మేందుకు ప్రయత్నం చేస్తే మండల వ్యవసాయ అధికారికి గానీ పోలీసులకుగాని సమాచారం అందించాలని తెలిపారు.
జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్