
ఆధ్యాత్మిక సర్క్యూట్..
ఆలయాలను చూసొద్దాం రండి
హైదరాబాద్‌కు చేరువలో యాదాద్రి జిల్లాలో అనేక ప్రసిద్ధమైన ఆలయాలు ఉన్నాయి. వేసవి సెలవుల్లో కుటుంబంతో కలిసి యాదగిరిగుట్ట నృసింహుడి దర్శనానికి వచ్చే భక్తులు ఈ
ఆలయాలను సందర్శించవచ్చు.
పసిడి కాంతులతో స్వర్ణగిరి దేవాలయం
యాదగిరిగుట్ట నుంచి 15 కిలోమీటర్ల దూరంలో వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై భువనగిరిలో శ్రీస్వర్ణగిరి వేంకటేశ్వర ఆలయం ఉంది. ఈ మధ్య కాలంలో ఈ ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. యాదగిరీశుడిని దర్శించుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో స్వర్ణగిరి ఆలయాన్ని సందర్శించుకుని వెళ్తుంటారు. తిరుపతిని తలపించేలా ఈ ఆలయం ఉండడంతో తిరుపతికి వెళ్లలేని భక్తులు స్వర్ణగిరి వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని వెళ్తుంటారు. ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో శ్రీరేణుక ఎల్లమ్మ ఆలయం ఉంటుంది.
యాదగిరిగుట్ట: హైదరాబాద్ నుంచి 60 కి.మీ. దూరంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఉంది. ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఉదయం 9గంటల నుంచి 10గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి 5 గంటలకు రూ.300 టిక్కెట్‌పై బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు. అంతేకాకుండా ధర్మ దర్శనంతో పాటు రూ.150 టిక్కెట్ కొనుగోలుపై వీఐపీ దర్శనానికి పంపిస్తారు. రాత్రి బస చేసేందుకు కొండపైన తెలంగాణ హరిత టూరిజంతో పాటు కొండ కింద దేవస్థానానికి చెందిన ప్రెసిడెన్షియల్ సూట్, తులసీ కాటేజీ, బస్టాండ్ సమీపంలో దేవస్థానం గదులు ఉన్నాయి. అంతేకాకుండా వివిధ కుల సంఘాలకు సంబంధించిన భవనాలు, ప్రైవేట్ గదులు అందుబాటులో ఉన్నాయి.
నాగిరెడ్డిపల్లిలో బంగారు శివలింగం
ఈ ఆలయం భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ సమీపంలో ఉంది. ఇక్కడ పూర్తిగా బంగారంతో శివలింగాన్ని తయారు చేసి ప్రతిష్ఠించారు. యాదగిరిగుట్ట నుంచి ఈ ఆలయం 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
సకల దేవతలకు నిలయం సురేంద్రపురి
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో సురేంద్రపురి పంచముఖ హనుమాన్ ఆలయం ఉంటుంది. ఇక్కడ భారీ ఎత్తులో పంచముఖ హనుమాన్, పంచ ముఖ శివుడి విగ్రహాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ వెంకటేశ్వరస్వామి ఆలయం సైతం ఉంటుంది. ప్రత్యేక టిక్కెట్ కొనుగోలు చేసి సురేంద్రపురిలో ఏర్పాటు చేసిన సకల దేవతలు కొలువైన మందిరాన్ని సందర్శించవచ్చు.
యాదగిరిగుట్టకు అనుబంధంగా పాతగుట్ట
యాదగిరీశుడి ఆలయం నుంచి 3కి.మీ. దూరంలో పూర్వగిరి(పాతగుట్ట) లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఉంది. యాదగిరిగుట్ట క్షేత్రం కంటే ముందు పూర్వగిరిలో స్వామి, అమ్మవార్లు వెలిశారని పురాణాలు చెబుతున్నాయి. క్రమక్రమంగా ఈ ప్రాంతమే పాతగుట్టగా మారింది. యాదగిరిగుట్ట నుంచి భక్తులు గుర్రం బండ్లపై ఈ ఆలయానికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు. యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు తప్పనిసరిగా పూర్వగిరీశుడిని దర్శించుకుంటారు.
వెంకటపురం
లక్ష్మీనరసింహస్వామి ఆలయం
యాదగిరిగుట్ట నుంచి కీసర, ఈసీఐఎల్ వెళ్లే మారంలో తుర్కపల్లి మండలం వెంకటపురంలో వెంకటగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం యాదగిరిగుట్ట నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆలయ కొండ గుహల్లో స్వామివారు కొలువై ఉన్నారు. మెట్ల మార్గంలో ఈ ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది.
వేములకొండ మత్స్యగిరి ఆలయం
వేములకొండ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం యాదగిరిగుట్ట నుంచి సుమారు 40 కిలోమీటర్లు ఉంటుంది. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి, సురేంద్రపురి, నాగిరెడ్డిపల్లిలోని శివాలయాన్ని సందర్శించిన భక్తులు వలిగొండ మీదుగా ఈ వేములకొండ ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయంలోని కోనేరులో మీసాలతో కూడిన చేపలు దర్శనమిస్తాయి.
కొలనుపాక జైన్ మందిరం
యాదగిరిగుట్ట ఆలయానికి వచ్చిన భక్తులు ఆలేరు మండలం కొలనుపాకలోని జైన్ మందిరం, శ్రీసోమేశ్వర ఆలయాలను సందర్శించవచ్చు. యాదగిరిగుట్ట నుంచి కొలనుపాక 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ జైన్ మందిరంతో పాటు సోమేశ్వర ఆలయం, వివిధ కుల సంఘాలకు సంబంధించిన మఠాలు సైతం ఉన్నాయి. జైన మందిరం, సోమేశ్వర ఆలయాలు నాటి కాకతీయులు, జైనులకు సంబంధించిన ఆనవాళ్లను గుర్తు చేస్తాయి.

ఆధ్యాత్మిక సర్క్యూట్..

ఆధ్యాత్మిక సర్క్యూట్..

ఆధ్యాత్మిక సర్క్యూట్..

ఆధ్యాత్మిక సర్క్యూట్..

ఆధ్యాత్మిక సర్క్యూట్..

ఆధ్యాత్మిక సర్క్యూట్..

ఆధ్యాత్మిక సర్క్యూట్..

ఆధ్యాత్మిక సర్క్యూట్..