రేపటి నుంచే డిగ్రీ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచే డిగ్రీ పరీక్షలు

May 13 2025 12:56 AM | Updated on May 13 2025 12:56 AM

రేపటి నుంచే డిగ్రీ పరీక్షలు

రేపటి నుంచే డిగ్రీ పరీక్షలు

భువనగిరి: కొంతకాలంగా డిగ్రీ పరీక్షల నిర్వహణపై నెలకొన్న సందిగ్ధత వీడింది. ఉన్నత విద్యామండలి చైర్మన్‌తో ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు జరిపిన చర్చలు ఫలించడంతో బుధవారం నుంచి డిగ్రీ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ గత నెల 1వ తేదీ నుంచి జరగాల్సిన ప్రాక్టికల్స్‌, 11వ తేదీ నుంచి జరగాల్సిన డిగ్రీ పరీక్షలను ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు బహిష్కరించాయి. ఈ క్రమంలో మంత్రులు, ఉన్నతాధికారులను కలిసి చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. తిరిగి ఈ నెల 14వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించేందుకు ఎంజీయూ పరీక్షల విభాగం అధికారులు 6వ తేదీన షెడ్యూల్‌ విడుదల చేసి, హాల్‌టికెట్లను ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. ఇదే సమయంలో మళ్లీ ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాల బకాయిలు విడుదల చేసే వరకు పరీక్షలను నిర్వహించబోమని తేల్చిచెప్పాయి. దీంతో మళ్లీ పరీక్షల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. కాగా సోమవారం ప్రైవేట్‌ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌తో ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ బాలకృష్ణారెడ్డి చర్చలు జరిపారు. వారి సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించడంతో ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి.

36 పరీక్ష కేంద్రాలు..

మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరీక్షల నిర్వహణ కోసం 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు 29,555 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో రెండో సెమిస్టర్‌ పరీక్షలకు 10,408, నాల్గో సెమిస్టర్‌కు 8,660, ఆరో సెమిస్టర్‌కు 8,447 మంది రెగ్యులర్‌ విద్యార్థులు ఉన్నారు. వీరితో పాటు బ్యాక్‌లాగ్‌ విద్యార్థులు ఒకటవ సెమిస్టర్‌ పరీక్షలకు 6,066, మూడో సెమిస్టర్‌కు 5,109, ఐదో సెమిస్టర్‌కు 4,171 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.

గతంలో పొందిన హాల్‌టికెట్లతో హాజరుకావచ్చు

ఈ పరీక్షలకు కొత్త హాల్‌టికెట్లతో పాటు గత నెల 11వ తేదీన పరీక్షలు జరగాల్సిన సమయంలో విడుదల చేసిన హాల్‌టికెట్లతోనూ హాజరుకావచ్చని ఎంజీయూ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్‌ జి. ఉపేందర్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్ద కళాశాల గుర్తింపు కార్డు లేదీ ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డులతో వస్తే అనుమతిస్తారని చెప్పారు.

ఉన్నత విద్యా మండలి చైర్మన్‌తో ప్రైవేట్‌ కాలేజీల మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ సభ్యులు

ఉన్నత విద్యామండలి చైర్మన్‌ హామీతో సమ్మె విరమించిన ప్రైవేట్‌

కళాశాలల యాజమాన్యాలు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 36 కేంద్రాలు

పరీక్షలకు హాజరుకానున్న

29,555 మంది విద్యార్థులు

పాత హాల్‌టికెట్‌ ఉన్నా

పరీక్షలకు అనుమతి

ఉన్నత విద్యా మండలి చైర్మన్‌కు ధన్యవాదాలు

తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ బాలకృష్ణారెడ్డి మా సమస్యలను విన్నవించగా.. ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాల బకాయిలను విడుదల చేసే విషయంపై హామీ ఇచ్చారు. ఆయన హామీ మేరకు సమ్మె విరమించి పరీక్షల నిర్వహణకు సహకరిస్తామని చెప్పాం. సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన చైర్మన్‌కు ధన్యవాదాలు.

– సూర్యనారాయణరెడ్డి, ప్రైవేట్‌ డిగ్రీ,

పీజీ కళాశాలల మేనేజ్‌మెంట్‌

అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement