
గౌతమ బుద్ధుడు గొప్ప దార్శనికుడు
నాగారం: ప్రపంచ మానవాళికి చక్కటి జీవన విధానాన్ని అందించిన గొప్ప దార్శనికుడు గౌతమ బుద్ధుడు అని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు అన్నారు. సోమవారం రాత్రి నాగారం మండలంలోని ఫణిగిరి బౌద్ధక్షేత్రం వద్ద బోధిసత్వ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బుద్ధ జయంతి వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై బుద్ధుడి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫణిగిరి బౌద్ధక్షేత్రం ఒకప్పుడు ప్రపంచస్థాయి బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లిందన్నారు. ప్రపంచ శాంతికి బుద్ధుడి బోధనలే మార్గమని అన్నారు. క్రీ.శ. 1వ శతాబ్దంలో ఫణిగిరి గ్రామం ధమ్మచక్రపురి పేరుతో బౌద్ధమతానికి నిలయంగా మారిందన్నారు. ఫణిగిరిలో లభించిన బౌద్ధ సందపను పరిరక్షించి, తెలంగాణ చారిత్రక వైభవాన్ని పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. ఫణిగిరి బౌద్ధ క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగామార్చాలన్నారు. అనంతరం మ్యూజియంలోని బౌద్ధ సంపదను పరిశీలించి, మ్యూజియం వెలుపల బోధి వృక్షాన్ని నాటారు. కార్యక్రమంలో తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఎల్సోజు చామంతినరేష్, బోధిసత్వ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పులిగిళ్ల వీరమల్లుయాదవ్, టీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంపాల రాజేష్, వేణు, వినోద్‌రావు, ఆలకుంట్ల బాలకృష్ణ, కొత్తగట్టు మల్లయ్య, బొడ్డు నాగరాజు, అనిల్, మధు, పురావస్తుశాఖ సిబ్బంది, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు
ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో బుద్ధ జయంతి