
బోరుకు అనుమతి తప్పనిసరి
భువనగిరిటౌన్ : పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా బోరు వేయాలంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని అదనపు కలెక్టర్ వీరా రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం భూగర్భ జలశాఖ జిల్లా అధికారి జ్యోతికుమార్‌తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వాల్టా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. విని యోగించుకున్న నీటిని భూమిలోకి ఇంకింపజేసేందుకు అవసరమైన నిర్మాణాలు చేసేలా ప్ర జలకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.
ఎంజీయూ పరిధిలో
14 నుంచి డిగ్రీ పరీక్షలు
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూని వర్సిటీ పరిధిలో ఈనెల 14 నుంచి డిగ్రీ సెమిస్టర్ 2, 4, 6 రెగ్యులర్, బ్యాక్‌లాగ్ 1, 3, 5 పరీక్షలు ప్రారంభమవుతున్నట్లు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్‌ఉపేందర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు గతంలో తీసుకున్న హాల్‌టికెట్ లేదా నూతన హాల్‌టికెట్‌తో వచ్చినా పరీక్షలకు అనుమతిస్తారని తెలి పారు. కళాశాల గుర్తింపు కార్డు, లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ గుర్తింపు కార్డుతో రావాలని పేర్కొన్నారు. పరీక్షల కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
రేషన్ దుకాణాల్లో తనిఖీలు
బీబీనగర్: మండలంలోని కొండమడుగు, రహీంఖాన్‌గూడెం, రాఘవాపురం, రుద్రవెళ్లి, వెంకిర్యాల, పడమటిసోమారం గ్రామాల్లోని రేషన్ దుకాణాల్లో సోమవారం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. లబ్ధిదారులకు అందజేసే బియ్యాన్ని పరిశీలించడంతో పాటు పంపిణీ విధానంపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. బియ్యం పంపిణీ సక్రమంగా లేకపోతే ఫిర్యాదు చేయాలని సూచించారు. లబ్ధిదారులకు నిర్ణీత సమయంలో బియ్యం అందజేయాలని డీర్లను ఆదేశించారు. తనిఖీల్లో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఎస్పీ యాదయ్య, ఎస్‌ఐలు స్వామిదాస్, సంతోష్, డిప్యూటీ తహసీల్దార్ నరసింహారావు పాల్గొన్నారు.
గుట్ట క్షేత్రంలో ఆర్జిత సేవలు పునఃప్రారంభం
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆర్జిత సేవలు పునః ప్రారంభం అయ్యాయి. నృసింహుడి జయంతి ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 9నుంచి 11వ తేదీ వరకు ప్రధానాయలంలో ఆర్జిత సేవలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఉత్సవాలు ఆదివారం ముగియడంతో సోమవారం నుంచి శ్రీసుదర్శన నారసింహహోమం, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, జోడుసేవలను ఆగమ శాస్త్రనుసారంగా అర్చకులు ప్రారంభించారు. వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.అదే విధంగా ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి.
అక్షరాస్యులుగా మార్చాలి
భువనగిరిటౌన్ : నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా మార్చేందుకు కృషి చేయాలని అదనపు కలెక్టర్(రెవెన్యూ) వీరారెడ్డి సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా వయోజన విద్య ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలన్నారు. ముందుగా ట్యూటర్లను ఏర్పాటు చేయాలని, అనంతరం జిల్లా, మండల, గ్రామ స్థాయిలో కమిటీలు వేసి ట్యూటర్లతో శిక్షణ ఇప్పించాలన్నారు. జిల్లాలో సుమారు 99 వేల మంది నిరక్షరాస్యులు ఉన్నట్టు నివేదిక ఉందన్నారు. ఉల్లాస్ యాప్ ద్వారా ప్రచారం చేసి ఎన్‌ఐసీపీ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో డీఆర్‌డీఓ నాగిరెడ్డి, డీపీఓ సునంద, వయోజన విద్య ఉపసంచాలకులు మమత, డీఈఓ సత్యనారాయణ, ఉల్లాస్ జిల్లా సభ్యులు కృష్ణారెడ్డి, రెడ్‌క్రాస్ సభ్యులు బాలాజీ, డీపీఎంలు పాల్గొన్నారు.

బోరుకు అనుమతి తప్పనిసరి