పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందించాలి

లప్పానాయక్‌ తండావాసులతో 
మాట్లాడుతున్న కలెక్టర్‌ పమేలా సత్పతి
 - Sakshi

కలెక్టర్‌తో లప్పానాయక్‌ తండావాసుల వాగ్వాదం

యాదగిరిగుట్ట రూరల్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా బస్వాపురం రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న భుములకు పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందిస్తేనే ఆందోళన విరమిస్తామని మండలంలోని లప్పానాయక్‌ తండావాసులు కలెక్టర్‌ పమేలా సత్పతికి తేల్చిచెప్పారు. మంగళవారం కలెక్టర్‌ తండావాసులు చేపట్టిన నిరసన దీక్షా శిబిరాన్ని సందర్శించారు. గ్రామంలో ఏమీ లేదని, పరిహారం కోసం ఇక్కడ దీక్షలు చేస్తున్నామని, తమకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, పరిహారం ఇవ్వాలని తండావాసులు కలెక్టర్‌ను డిమాండ్‌ చేశారు. భూ నిర్వాసితులకు చెప్పిన సమయంలోనే దాతర్‌పల్లిలో పునరావాసం కోసం చర్యలు చేపట్టి, కొన్ని నిధులు కూడా మంజూరు చేశామని కలెక్టర్‌ వారికి తెలిపారు. సాధ్యమైనంత మేరకు తన పరిధిలోని ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నానని కలెక్టర్‌ తండావాసులకు తెలిపినా పట్టించుకోకుండా ఆమెతో వాగ్వాదానికి దిగారు. దీంతో కలెక్టర్‌ అసహనంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం తండా వాసులతో ఆర్డీఓ భూపాల్‌రెడ్డి, ఇరిగేషన్‌ ఎస్‌ఈ శ్రీనివాస్‌ మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దాతర్‌పల్లి గ్రామంలో పునరావాసం కోసం అన్ని డిపార్ట్‌మెంట్‌లతో మాట్లాడి ఎంత బడ్జెట్‌ అవుతుందో తెలుసుకుని కలెక్టర్‌ వివరాలు తీసుకున్నారని తెలిపారు. ఏప్రిల్‌ నెలలో డబ్బులు విడుదల అవుతాయని, ఒక నెలలో ప్లాట్‌లు కేటాయిస్తామని తెలిపారు. అయితే అప్పటివరకు దీక్షలు కొనసాగిస్తామని తండా వాసులు తేల్చి చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్‌ దీరావత్‌ బుజ్జి, ఉపసర్పంచ్‌ మంక్యానాయక్‌ ఉన్నారు.

Read latest Yadadri News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top