మరో మూడు నెలలు

- - Sakshi

ఆధార్‌కార్డుతో పాన్‌కార్డు లింక్‌కు జూన్‌ 30 వరకు గడువు పొడిగింపు

సాక్షి, యాదాద్రి : ఆధార్‌ కార్డుతో పాన్‌ కార్డు (శాశ్వత ఖాతా) అనుసంధానానికి కేంద్ర ఆదాయ పన్నుల శాఖ మరో మూడు నెలల గడువు పొడిగించింది. మెజార్జీ బ్యాంక్‌ ఖాతాదారులు అనుసంధానం చేసుకోకపోవడంతో మార్చి 31వరకు ఉన్న గడువును జూన్‌ 30 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఆ శాఖ ప్రచారం లోపం ఖాతాదారుల అవగాహన లేమితోనే ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఆధార్‌ కార్డుతో పాన్‌ కార్డు అనుసంధానానికి అపరాధ రుసుముగా రూ.వెయ్యి విధించడంతో కూడా ఖాతాదారులు అనాసక్తి చూపుతున్నారు. భారంగా మారిన అపరాధ రుసుమును తొలగించాలని సర్వత్రా డిమాండ్‌ చేస్తున్నారు.

పాన్‌కార్డు అనుసంధానం కాకపోతే..

ఆధార్‌కార్డుతో పాన్‌కార్డు లింక్‌ చేసుకోవాలనే ప్రక్రియ 2016లో ప్రారంభమైంది. తొలుత ఉచితంగానే ఆన్‌లైన్‌లో ఆధార్‌కార్డుతో పాన్‌కార్డు లింక్‌ అయ్యేది. ఆధార్‌కార్డులు ఉన్నవారు వేలాదిమంది జిల్లాలో పాన్‌కార్డుతో అనుసంధానం కాలేదు. దీంతో 2022 వరకు రూ.500 ఫైన్‌తో లింక్‌ చేశారు. అయినప్పటికీ అందరూ ఆధార్‌ లింక్‌ చేయకపోవడంతో ప్రస్తుతం రూ.1000 అపరాధరుసుము నిర్ణయించారు. అయితే పలువురు అనుసంధానం కోసం మీసేవ, ఇంటర్నెట్‌ కేంద్రాలకు వెళ్లగా అపరాధ రసుము గురించి చెప్పడంతో అవాక్కవుతున్నారు. రూ.1000తోపాటు మరో రెండు వందలు వసూలు చేయడం భారంగా మారింది. అయితే ఆధార్‌పాన్‌కార్డు లింక్‌ కాకపోతే ముందుగా పాన్‌కార్డు బ్లాక్‌ అవుతుంది. పాన్‌కార్డు లింక్‌ అయిన బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి రూ.50 వేలకు మించి లావాదేవీలు నిర్వహించే వీలుండదు. దీంతో కొత్త పాన్‌ కార్డు కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవడం, తమ ఆర్థిక లావాదేవీల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది జూన్‌ 30 వరకు ఆధార్‌తో పాన్‌కార్డు లింక్‌చేసుకోవడానికి మరో అవకాశం కల్పించడంతో పలువురు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, అపరాధ రుసుము మాత్రం చెల్లించాల్సి ఉంటుంది.

ఫ ప్రచార లోపం.. అవగాహన లేమితో అనుసంధానానికి ఖాతాదారుల అనాసక్తి

ఫ అపరాధ రుసుము రూ.వెయ్యి తొలగించాలని సర్వత్రా డిమాండ్‌

ప్రచారం లేకపోవడంతోనే..

ఆధార్‌కు పాన్‌ కార్డు లింక్‌పై క్షేత్రస్థాయిలో సరైన ప్రచారం లేకపోవడం వల్లే చాల మంది అనుసంధానం చేసుకోలేకపోతున్నారు. ప్రధానంగా సెల్‌ఫోన్‌ మెసేజ్‌లు ఇంగ్లిష్‌లో రావడంతో వాటిని చదవలేకపోవడం, నిరక్ష్యరాస్యులు చాలమంది బ్యాంకులో డబ్బును సేవింగ్‌ ఖాతాల్లో జమ చేసుకోవడం ఎప్పుడో కాని వాటిని డ్రా చేయకపోవడం వంటి పలు కారణాలతో జాప్యం జరుగుతోంది.

అపరాధ రుసుము తొలగించాలి

ఆధార్‌కార్డుతో పాన్‌కార్డు అనుసంధానం కోసం నిర్ణయించిన అపరాధ రుసుమును తొలగించాలి. చాల మందికి ఆనుసంధానం చేసుకోవాలన్న విషయం తెలియదు. అయితే లింక్‌చేయడానికి గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలి. అపరాధ రుసుము లేకుండానే ఆధార్‌తో లింక్‌ చేయాలి.పేద వర్గాలకు ఇబ్బంది లేకుండా చూడాలి.

– చింతకింది మల్లేశ్‌, ఆలేరు

Read latest Yadadri News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top