
డిజిటల్ క్లాస్ రూమ్‌ను ప్రారంభిస్తున్న బీసీ కార్పొరేషన్ జిల్లా అభివృద్ధి అధికారి
భువనగిరి : జిల్లాలోని కస్తూరిబా పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 2023–24 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని డీఈఓ నారాయణరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6నుంచి 10వ తరగతి వరకు 666 సీట్లు, ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సుల్లో 443 ఖాళీలు, రెండో సంవత్సరంలోని 198 ఖాళీల భర్తీకి సంబంధిత మండలాల ప్రత్యేక అధికారులను సంప్రదించి దరఖాస్తులను అందజేయాలని కోరారు. అర్హత కలిగిన విద్యార్థులు అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని సూచించారు.
లక్ష్య సాధనకు కృషి చేయాలి
ఆత్మకూరు(ఎం): విద్యార్థులు కష్టపడి చదివి లక్ష్య సాధనకు కృషిచేయాలని బీసీ కార్పొరేషన్ జిల్లా అభివృద్ధి అధికారి యాదయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహంలో యువ స్వచ్ఛంద స్వంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని, డిజిటల్ తరగతి గదులను ప్రారంభించి మాట్లాడారు. పదవ తరగతి పరీక్షలు సమీపిస్తుండటంతో విద్యార్థులు సమయం వృథా చేయకుండా సిద్ధం కావాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ జన్నాయికోడె నగేష్, ఎంపీటీసీ యాస కవిత, వార్డెన్ వేముల స్వప్న, ప్రధానోపాధ్యాయులు అరవిందరాయుడు తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్‌తోనే గ్రామాల అభివృద్ధి
యాదగిరిగుట్ట రూరల్: కేసీఆర్ పాలనలోనే గ్రామాలు అభివృద్ధి బాట పట్టాయని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. మండలంలోని మాసాయిపేట గ్రామంలో రూ.12లక్షల వ్యయంతో నిర్మించిన బీసీ కమ్యూనిటీ భవనాన్ని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డితో కలిసి మంగళవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో గ్రామాల రూపురేఖలు పూర్తిగా మారాయని, ప్రతీ ఊరిలో సీసీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీలు, కమ్యూనిటీ హాల్‌లు ఏర్పాటు చేసుకున్నామన్నారు. పల్లెప్రగతితో అనేక మార్పులు జరిగాయని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ తోటకూరి అనురాధ, సర్పంచ్ వంటేరు సువర్ణ, బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు వంటేరు సురేష్‌రెడ్డి, ఉపసర్పంచ్ వాకిటి అమృత కృష్ణ, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు గుణగంటి బాబురావు. గొట్టిపర్తి బాలరాజు, సొప్పరి మధు, బండ సిద్దులు, కటకం బాలరాజు, రాపోలు విక్రమ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
పదో తరగతి విద్యార్థులకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు
భువనగిరి : ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల కోసం డీఈఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు డీఈఓ నారాయణరెడ్డి మంగళవారం ఒక ప్రకటలో తెలిపారు. పరీక్ష కేంద్రాలు, హాల్ టిక్కెట్లు, ఇతర సమస్యలు ఉంటే సమాచారం కోసం కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన సెల్ నంబర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎలాంటి సమాచారం అవసరమైన సెల్ నంబర్ 9849884563, 9848026032ను సంప్రదించాలని కోరారు.

మాసాయిపేటలో కమ్యూనిటీహాల్‌ను ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ