యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. క్షేత్రపాలకుడిగా కొనసాగుతున్న ఆంజనేయస్వామికి ఆచార్యులు ఆకుపూజ నిర్వహించారు. ఆంజనేయస్వామిని సింధూరంతో అభిషేకించి, తమలపాకులతో అర్చించారు. అనంతరం అంజనీపుత్రుడికి ఇష్టమైన నైవేద్యాన్ని ఆరగింపు పెట్టారు. ప్రధానాలయంలో, విష్ణు పుష్కరిణి, అనుబంధ ఆలయాలైన శివాలయం, పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాల వద్ద ఉన్న ఆంజనేయస్వామిని భక్తులు మొక్కుకొని, పూజలు చేశారు. ఇక ప్రధానాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సంప్రదాయ పూజలు కొనసాగాయి. సుప్రభాతం, అభిషేకం, అర్చన, శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, జోడు సేవలను విశేషంగా నిర్వహించారు.