
సాక్షి, యాదాద్రి : తెలంగాణలో రైతే రాజని, దేశంలోనూ వ్యవసాయం మళ్లీ చిగురిస్తుందంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ చలువేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. భువనగిరిలో రైతు సేవా కేంద్రం నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రైతు మహాజన సభలో మంత్రి ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగం నిర్లక్ష్యానికి గురైందన్నారు. వ్యవసాయం చేస్తున్నామంటే సిగ్గుపడే రోజుల నుంచి కాలర్ ఎగరేసి మేము చేస్తున్నది వ్యవసాయం అని చెప్పుకునే స్థితికి వచ్చామన్నారు. ఐటీ రంగంలో ఉన్నవారు సైతం వ్యవసాయంపై మక్కువతో ఉద్యోగాలు వదిలి ఊరిబాట పడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కోటి 47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడితో రికార్డ్ సృష్టించామని చెప్పారు. సమైక్యాంధ్రలో సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుకు ఏనాడూ వరుసగా మూడు సార్లు నీటిని విడుదల చేయలేదన్నారు. స్వరాష్ట్రంలో వరుసగా 16 సార్లు నీటిని విడుదల చేసుకున్నామన్నారు. వలసలకు కేరాఫ్‌గా నిలిచిన మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల రైతులు ఉన్నవారిలో సేద్యం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. నేడు దేశ నలుమూలల నుంచి బతుకుదెరువు నిమిత్తం తెలంగాణకు వలసలు మొదలైనట్లు వివరించారు. మహబూబ్‌నగర్ జిలాకు వరి నాట్ల కోసం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న వలసలే ఇందుకు నిదర్శనం అన్నారు.
ఫ సీఎం కేసీఆర్ వల్లే దేశంలో వ్యవసాయం మళ్లీ చిగురిస్తుంది
ఫ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
