యాదగిరిగుట్ట తహసీల్దార్‌గా శ్రీనివాసరాజు

గోల్డ్‌ మెడల్‌ అందుకుంటున్న సృజనారెడ్డి
 - Sakshi

యాదగిరిగుట్ట రూరల్‌: యాదగిరిగుట్ట తహసీల్దార్‌గా సీహెచ్‌. శ్రీనివాసరాజు సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. నారాయణపురం మండలంలో పనిచేస్తున్న ఆయనను ప్రభుత్వం యాదగిరిగుట్టకు బదిలీ చేసింది. యాదగిరిగుట్టలో విధులు కొనసాగించిన రాము భూక్యాను సెక్రటేరియట్‌కు రిలీవ్‌ చేశారు.

పరిహారం చెల్లించాలి

రాజాపేట: తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ రాజాపేట మండలంలోని చల్లూరు గ్రామానికి చెందిన రైతులు సోమవారం కలెక్టర్‌ పమేలా సత్పతికి వినతిపత్రం అందజేశారు. గంధమల్ల ప్రాజెక్టు నుంచి కుడికాల్వ ద్వారా రైతులకు సాగునీరు అందించేందుకు గ్రామంలో భూసేకరణ చేపట్టారని, రైతుల నుంచి తీసుకున్న భూమికి నష్టపరిహారం మాత్రం ఏళ్లు గడుస్తున్నా చెల్లించడంలేదని వాపోయారు. భూమి ధరణి పోర్టల్‌లో ఫ్రీజ్‌ కావడంతో రైతుబంధు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో మీస బాలమల్లయ్య, కీర్తి నాగేష్‌, నంగునూరి లక్ష్మీనారాయణ, గుమ్ముల ప్రభాకర్‌, బింగి ఐలయ్య, పెండెం ప్రభాకర్‌ ఉన్నారు.

విద్యార్థులకు చదువుతోపాటు

ఆర్యోగం ప్రధానం

చౌటుప్పల్‌: విద్యార్థులకు చదువుతోపాటు ఆర్యోగం ఎంతో ప్రధానమని మున్సిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు అన్నారు. చౌటుప్పల్‌ పట్టణ కేంద్రంలోని జెడ్పీ ఉన్నత, లక్కారంలోని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు దివీస్‌ పరిశ్రమ ఆధ్వర్యంలో సోమవారం ఉచిత వైద్య పరీక్షలు చేశారు. అనంతరం బ్యాగులు, నోట్‌పుస్తకాలు, షూస్‌, వాటర్‌బాటిళ్లు, హార్లిక్స్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ బొడిగె అరుణబాలకృష్ణ, దివీస్‌ ప్రతినిధులు వల్లూరి వెంకటరాజు, వెంకటేశ్వర్లు, సాయికృష్ణ ఉన్నారు.

సృజనారెడ్డికి

గోల్డ్‌ మెడల్‌ ప్రదానం

భువనగిరి: పట్టణానికి చెందిన ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్‌ రఘుపతిరెడ్డి కుమార్తె డాక్టర్‌ కొప్పుల సృజనారెడ్డికి ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో సోమవారం గోల్డ్‌ మెడల్‌ ప్రదానం చేశారు. అబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ పీజీ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈమేరకు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి గోల్డ్‌ మెడల్‌ అందజేశారు. కార్యక్రమంలో ఉస్మానియా మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శశికళారెడ్డి, ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి నాగేందర్‌, డాక్టర్‌ రఘుపత్తిరెడ్డి ఉన్నారు.

శాంతిభద్రతల

పరిరక్షణపై అవగాహన

తుర్కపల్లి: సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, ప్రజలు సహకరించాలని ఎస్‌ఐ రాఘవేందర్‌గౌడ్‌ కోరారు. సోమవారం తుర్కపల్లి మండలంలోని బద్దూతండా, ముల్కలపల్లి గ్రామాల్లో సైబర్‌ నేరాలు, శాంతి భద్రతల పరిరక్షణపై అవగాహన కల్పించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు బద్దూతండా సర్పంచ్‌ సురేశ్‌నాయక్‌ రూ.లక్ష, ముల్కలపల్లి సర్పంచ్‌ మల్లప్ప రూ.50 వేలు విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీపీ భూక్య సుశీల, ఎంపీటీసీలు పలుగుల నవీన్‌, గిద్దె కరుణాకర్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్‌రెడ్డి, భాస్కర్‌నాయక్‌ పాల్గొన్నారు.

బస్‌పాస్‌ మేళా

చౌటుప్పల్‌: నార్కట్‌పల్లి ఆర్టీసీ బస్‌డిపో ఆధ్వర్యంలో సోమవారం చిన్నకొండూర్‌ గ్రామంలో దివ్యాంగుల బస్‌పాస్‌ మేళా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ బక్క స్వప్నశ్రీనాథ్‌ మాట్లాడుతూ దివ్యాంగులు రాయితీ బస్‌పాస్‌లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బస్‌పాస్‌ ఇన్‌చార్జ్‌ రామచంద్రం, యాదయ్య, కొమ్ము గణేష్‌ పాల్గొన్నారు.

కొయ్యలగూడెం

చేనేత సంఘం వార్షిక సభ

చౌటుప్పల్‌: మండల పరిధిలోని కొయ్యలగూడెం గ్రామంలోని చేనేత సహకార సంఘంలో సోమవారం 72వ వార్షిక, 78వ సాధారణ మహాసభ నిర్వహించారు. సంఘం పర్సన్‌ ఇన్‌చార్జ్‌ గడ్డం జయశంకర్‌ సహకార పతాకాన్ని ఆవిష్కరించారు. ఎంపీటీసీ జెల్ల ఈశ్వరమ్మ, సంఘం ప్రతినిధులు గుర్రం వెంకటేశ్వర్లు, కర్నాటి పారిజాత, ఏలె భాస్కర్‌, పొట్టబత్తిని ఉపేందర్‌, జెల్ల వెంకటేశం, రవ్వ సంతోష్‌, మాచర్ల ఈశ్వరమ్మ, పొట్టబత్తిని హరేకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Read latest Yadadri News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top